Vemulawada | వేములవాడ, జనవరి 4: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం సముదాయంలో జంతుబలి చోటుచేసుకున్నది. ఆలయ సముదాయం పక్కనే ఈ ఘటన జరుగడంతో భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయాన్ని ఆనుకుని ఉన్న భీమేశ్వర గెస్ట్‌హౌస్ (2) ను శనివారం అటవీశాఖ అధికారులు అద్దెకు తీసుకున్నారు. బద్దిపోచమ్మను దర్శించుకున్న అనంతరం భీమేశ్వర సదన్‌లో మేకను బలిచ్చారు. ఇదే సమయంలో భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని వస్తున్న భక్తులతోపాటు పీఆర్వో కార్యాలయం వద్ద ఉన్న భక్తులు చూసి అభ్యంతరం వ్యక్తంచేశారు. పక్కనే ప్రసాదాల తయారీ విభాగం ఉండగా జంతుబలి ఎలా చేస్తారంటూ అసహనం వ్యక్తంచేశారు. దీంతో భీమేశ్వర సదన్ వసతిగృహాల ఇన్స్పెక్టర్ సింహాచారి అతిథి గృహం వద్దకు చేరుకొని వెంటనే వారిని ఖాళీ చేయించారు.