ఆన్లైన్ ప్రిపరేషన్ మంచిదే కానీ
సోషల్ మీడియాకు కత్తెర పడాల్సిందే
టీ సాట్ వంటి యాప్‌ల్లో పాఠాలు వినండి
అక్కరకు రాని యాప్‌లను పక్కన పెట్టండి
సెల్‌ఫోన్ వాడకంలో పరిమితులు విధించుకోండి
అభ్యర్థులకు సూచనలు చేస్తున్న పోటీ పరీక్షల నిపుణులు
యాప్‌ల ద్వారా శిక్షణ ప్రారంభించిన ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు
ఇది ఉద్యోగ ప్రకటనలు వచ్చే సమయం. ఉద్యోగార్థులతో నగరంలోని ప్రధాన లైబ్రరీలు, యూనివర్సిటీల గ్రంథాలయాలు
కళకళలాడుతున్నాయి. సర్కారు కొలువు సాధించాలనే పట్టుదలతో నిరంతరాయంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే కొంతమంది వర్క్ చేసుకుంటూ.. ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఆన్లైన్
కోచింగ్ అందుబాటులో ఉంది. కొవిడ్ లాంటి సందర్భాల్లో ఆన్లైన్ చదువు ఉత్తమమే. కానీ పోటీపరీక్షల్లో నెగ్గాలంటే సోషల్
మీడియాకు కత్తెర పెట్టాల్సిందే.
సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మీ జీవితాశయం ప్రభుత్వ ఉద్యోగమేనా? బాగా చదివి సరే లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నారా? అయితే అన్నింటికన్నా ముందు సమయం వృథా కావడాన్ని అరికట్టాలని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్ ఉన్నంతసేపు వినోద భరిత యాప్‌ల ద్వారా రోజుకు కనీసం 4 నుంచి 5 గంటల సమయం వృథా అవుతున్నదని చెబుతున్నారు. ఈ సమయాన్ని అభ్యర్థులు పొదుపు చేసి తమ శిక్షణకు ఉపయోగించుకోగలిగితే విజయం తథ్యమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో..ప్రభుత్వ శిక్షణ సంస్థ టీ సాట్‌తో పాటు పలు ప్రైవేటు కోచింగ్ సంస్థలు కూడా యాప్‌ల ద్వారా పాఠాలు, పరీక్షలతో కూడిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆన్లైన్లో అనవసర విషయాలను పక్కన పెట్టి అక్కర కొచ్చే పాఠాల వీడియోలను అనుసరిస్తే గెలుపు సులువేనని శిక్షకులు స్పష్టం చేస్తున్నారు.
ఆన్లైన్ కోచింగ్ కోసం ఒక్కో సంస్థ ఒక్కో యాప్‌ను రూపొందించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ (టీసాట్) నెట్వర్క్ చానెళ్ల ద్వారా ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్, డిగ్రీ , ఇంజినీరింగ్ విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నది. దీంతోపాటు జీమ్యాట్ ప్రసారాల్లో భాగంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశంపై ప్రధానంగా ఐఎస్బీ, ఐఐఎం, ఎస్బీజైన్ వంటి ప్రత్యేక బిజినెస్ స్కూల్లో ప్రవేశించే విద్యార్థులకు టిసాట్ ప్రసారం చేసే పాఠ్యాంశాలు ప్రయోజనం చేకూరుతాయని సీఈవో శైలేశ్‌రెడ్డి తెలిపారు.
వాటితో సమయం వృథా..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, స్నాప్‌చాట్, వాట్సాప్‌లాంటి సామాజిక మాద్యమాల యాప్స్ అభ్యర్థుల దృష్టి మరల్చే అవకాశం ఉంది. అంతేకాదు విలువైన సమయాన్ని వృథా చేస్తాయి. అందుకే అక్కరకురాని యాప్స్‌తో తంటాలు పడే కంటే ‘దుష్ట యాప్స్‌కు దూరముండాలె’ అనే సూత్రాన్ని పాటించాలి. మార్కులు తెచ్చే యాప్స్‌తో మాత్రమే ఉద్యోగార్థులు మమేకం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగార్థులకు, బోర్డు ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యే వారు అనవసర యాప్స్ జోలికి వెళ్లకుండా ఉంటే సమయం ఆదా కావడమే కాకుండా, ఏకాగ్రతను కోల్పోకుండా జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రత్యేక యాప్‌లతో ప్రయోజనం..
సర్కారు కొలువు కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. సోషల్ మీడియా యాప్స్ పరిమితిని సెట్ చేసేందుకు, మీపై మీకు నియంత్రణకు పేరెంట్ కంట్రోల్ యాప్ ఆండ్రాయిడ్‌లో ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. దీంతో మీ సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ వినియోగ సమయం మించిపోయినప్పుడు మిమల్ని అలర్ట్ చేస్తుంది. ఐఎస్వో-12లో స్క్రీన్ టైమ్ అనేది అంతర్నిర్మిత యాప్ ఉంది. ఇదికూడా మన ఫోన్ వినియోగాన్ని తెలియజేస్తుంది. లేదంటే ఫోన్‌ను ఎరోప్లేన్, నో డిస్టర్బ్ మోడ్‌లో పెడితే యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.
కోచింగ్ సెంటర్ల యాప్స్..
నగరంలోని అన్ని కోచింగ్ సెంటర్లు యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్లేస్టోర్‌లో ఆయా పేర్లతో దర్శనమిస్తున్నాయి. బీఈడీ, డీఈడీ అభ్యర్థుల శిక్షణకు ఎమిలీ అకాడమీ ప్రత్యేకంగా నిలుస్తుందని అభ్యర్థులు తెలిపారు. అశోకా ఆన్లైన్ అకాడమీ, కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ, ఎస్ఆర్ శంకరన్, ఏకేఎస్, ఆర్సీరెడ్డి, అనలాగ్, చాహల్ ఐఏఎస్ అకాడమీ, హోలిస్టిక్, డ్రీమ్ లాంటివే కాకుండా గ్రూప్-1, 2, 3, 4.. ఎస్ఐ, కానిస్టేబుల్స్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా
ఆన్లైన్ శిక్షణతో పాటు పలు యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఇది చదవాల్సిన సమయం
ఇంతకు మించిన సమయం దొరకదు. శ్రద్ధగా చదవాల్సిన సందర్భమిది. ప్రభుత్వ కొలువు సాధించాల్సిన తరుణం. కాబట్టి మీరు అన్ని సోషల్ మీడియా గ్రూపుల నుంచి నిష్క్రమించండి. మిత్రబృందం, బంధువులు, కమ్యూనిటీ, గ్రామం, మండలం, జిల్లా గ్రూప్స్ లాంటివి చాలా ఉంటాయి. ఉద్యోగం సాధించే వరకు వాటన్నింటి నుంచి వెంటనే ఎగ్జిట్ కావాలి. లేదంటే అవి మీ విలువైన సమయాన్ని వృథా చేస్తాయి. ఏకాగ్రత, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదవండి. ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత… ఆ గ్రూపుల్లో ఉన్న వారందరూ మీ వద్దకు పుష్పగుచ్ఛం పటుకొచ్చి మీకు శుభాకాంక్షలు తెలపాలి. మిమ్మల్ని అభినందించాలి. ఆ సందర్భం మీ జీవితంలో వచ్చి తీరేలా ప్రణాళికా బద్ధంగా చదవాలని అభ్యర్థులకు సూచిస్తున్నా. గ్రూప్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలో చాలా మంది నిపుణులు, కోచింగ్ సంస్థలు యూట్యూబ్‌లు, యాప్‌ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. వాటిని ఫాలో అవ్వండి. సబ్జెక్టుకు సంబంధించినవి తప్ప మరే వీడియోలు కానీ, లింక్స్ కానీ క్లిక్ చేయకుండా మీ సమయాన్ని ఆదా చేసుకోండి. ఆల్ ద బెస్ట్.
– మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్,
గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు
అవసరమైన యాప్స్‌నే ఉపయోగించాలి
సమయం వృథాచేసే యాప్స్‌ను వదిలించుకోవాలి. అవసరమైన, విజ్ఞానాన్ని అందించే యాప్స్‌తో స్నేహం చేయండి. అది మీకు మీతోపాటు ఉన్న మిత్రులకు ఉపయోగకరంగా ఉంటుం ది. ఉద్యోగార్థులకైతే సబ్జెక్టుల వారీగా సమాచారాన్ని ఇచ్చే యాప్స్ చాలా ఉన్నాయి. వాటిని ఇన్స్టిట్యూట్ల వారీ గా రూపొందించారు. జ్ఞాపకశక్తిని తగ్గించుకునే పద్ధతులను వదిలివేయాలి. సబ్జెక్టులను అంశాల వారీగా పునశ్చరణ (రీకాల్), గుర్తుపెట్టుకోవడం (రికగ్నైజ్) చేసుకోవడం ఉత్తమం. ఏ ఉద్యోగమైతే సాధించాలని అనుకుంటారో దాని కోసమే కష్టపడి చదవండి.
– మోజెస్, ఎమిలీ అకాడమీ
ఉపయోగపడేవే ఉంచండి
కరోనా, పెండ్లి, ఉద్యోగాలు, విదేశాల్లో ఉండటం.. ఇలా కారణాలు ఏవైనా ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగింది. లైవ్‌లో అన్ని అంశాలను పసిగట్టకపోవచ్చు. రికార్డెడ్ వీడియోల వల్ల ఇంట్లోనో, కార్యాలయాల్లోనో ఖాళీ సమయాల్లో వినడానికి బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఉపయోగం ఉన్న సామాజిక మాధ్యమాలనే టచ్ చేయాలి. ఉపయోగం లేని వాటి జోలికి పోకూడదు. కేపీఐఏఎస్ యాప్.. ప్లేస్టోర్‌లో ఉంటుంది. దీని ద్వారా మీరు వీడియోలు వినొచ్చు.
– కృష్ణప్రదీప్, 21st ఐఏస్ అకాడమీ