ECB : ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్‌ను ఇంగ్లండ్ (England) జట్టు సొంతగడ్డపై ఆరంభించనుంది. త్వరలోనే టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూన్ 20న తొలి టెస్టు జరగనుండగా.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) గురువారం తొలి టెస్టు కోసం బలమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. 14 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. బెన్ స్టోక్స్(Ben Stokes) నేతృత్వం వహించనుండగా పేసర్ జేమీ ఓవర్టన్ (Jamie Overton)కు మూడేళ్ల తర్వాత పిలుపు వచ్చింది. సీనియర్ ఆటగాళ్లు రూట్, పోప్, క్రాలే, డకెట్‌లతో బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది.
డబ్ల్యూటీసీలో ఈ ఐదు టెస్టుల సిరీస్ ఇంగ్లండ్‌కు చాలా కీలకం. అందుకే.. విజయంపై కన్నేసిన ఇంగ్లండ్ బలమైన పేస్ దళాన్ని ఎంపిక చేసింది. ప్రధాన పేసర్లు ఆర్చర్, మార్క్ వుడ్(Mark Wood)తో పాటు యువకెరటం గస్ అట్కిన్సన్ గాయాలపాలైన నేపథ్యంలో ఓవర్టన్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్‌లను ఎంపిక చేశారు సెలెక్టర్లు.
Series Loading : ◼◼◼◻
Who is the first name in your XI?
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/YxUeU4Vv3z
— England Cricket (@englandcricket) June 5, 2025
2022లో న్యూజిలాండ్‌పై చివరిసారిగా వైట్ జెర్సీ వేసుకున్న ఓవర్టన్కు ప్రస్తుతం 31 ఏళ్లు. అయితే.. మే 29న వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఈ స్పీడ్‌స్టర్ కుడిచేతి చిటికెనవేలు విరిగింది. సో.. అతడు ఇప్పుడు ఇంగ్లండ్ వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడు. తొలి టెస్టుకు ఇంకా 15 రోజులు సమయం ఉండడంతో ఆలోపు అతడు కోలుకొని ఫిట్నెస్ సాధిస్తాడని స్టోక్స్ బృందం నమ్మకంతో ఉంది.
తొలి టెస్టు స్క్వాడ్ : ఇంగ్లండ్ బెన్ స్టోక్స్(కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీబ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), బ్రాండన్ కార్సే, సామ్ కుక్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్,
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో జూన్ 20న ఇరుజట్ల మధ్య తొలి టెస్టుతో సిరీస్ మొదలవ్వనుంది. జూలై 2న రెండో టెస్టు, జూలై 10న మూడోది, జూలై 23న నాలుగో మ్యాచ్, జూలై 31న ఐదో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడుతాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో ఇరుజట్లకు ఇదే మొదటి సిరీస్. కాబట్టి.. ఇరుజట్లు విజయం కోసం తమ అస్త్రాలను ఉపయోగించనున్నాయి. సిరీస్ కొల్లగొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్లు వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. కుర్రాళ్లతో నిండిన జట్టను గిల్ ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారనుంది.