జైపూర్, నవంబర్ 3 : మద్యం మత్తులో ఒక డంపర్ ట్రక్ డ్రైవర్ చేసిన విధ్వంసంలో 19 మంది మరణించిన విషాద ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సోమవారం లోహమండి రోడ్లో వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ దారిలోని పలు కార్లు, మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలను ఢీకొంటూ, పాదచారులను తొక్కుకుంటూ దూసుకుపోయింది.
తీవ్ర మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ తన ట్రక్ ఇతర వాహనాలను ఢీకొంటున్నా, ట్రక్కు కింద నలిగి అమాయకుల ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా, ఆపకుండా ఐదు కిలోమీటర్ల పాటు అలాగే వేగంగా నడుపుకుంటూ బీభత్సం సృష్టించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చివరకు ఒక వాహనాన్ని ఢీకొని ట్రక్కు ఆగిపోయిన తర్వాతే ఈ విధ్వంసం ఆగింది. ఈ విధ్వంసంలో పలువురు వాహనాల్లోనే మరణించగా, చాలామంది తీవ్ర గాయాలతో వాటిలోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు లాగి సమీపంలోని దవాఖానలకు తరలించారు. పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించి ఉన్నట్టు నిర్ధారించారు.