న్యూఢిల్లీ : కనీస హాజరు లేదన్న కారణంతో గుర్తింపు పొందిన ఏ న్యాయ కళాశాల, యూనివర్సిటీ లేదా సంస్థ విద్యార్థిని పరీక్ష రాయనివ్వకుండా నిరోధించరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. విద్యలో ముఖ్యంగా న్యాయ విద్యలో హాజరు నిబంధనలు విద్యార్థి బలవన్మరణాలకు దారితీసే విధంగా కాని వారు మానసిక వేదనకు గురయ్యే విధంగా కాని కఠినంగా ఉండరాదని హైకోర్టు అభిప్రాయపడింది.
2016లో ఢిల్లీలోని అమిటీ న్యాయ కళాశాల విద్యార్థి సుషాంత్ రోహిల్లా ఆత్మహత్య ఘటనపై చేపట్టిన సుమోటో కేసును హైకోర్టు సోమవారం మూసివేస్తూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సుషాంత్ ఆత్మహత్య వెనుక తక్కువ హాజరుతోపాటు మరే ఇతర కారణాలు ఉన్నప్పటికీ అటెండెన్స్ నిబంధనల కారణంగా ఓ యువకుడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.