ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలను ఉద్దేశించి తమిళ అగ్రనటుడు అజిత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రజలకు సుపరిపాలన అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని, అయితే ప్రజలు మాత్రం వాటి నుంచి ఉచిత పథకాలను ఆశిస్తున్నారని అజిత్ వ్యాఖ్యానించారు. ‘ప్రజల అవసరాలన్నింటినీ తీర్చేంత డబ్బు మన ప్రభుత్వాల వద్ద ఉందా? తమ అవసరాలను తీర్చాలని ప్రజలు ఆశించడంలో తప్పులేదు. కానీ ప్రతీది ప్రభుత్వమే సమకూర్చాలనుకోవడం సమంజసం కాదు’ అని అజిత్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.
దేశంలోని సామాన్యుల జీవితాలపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని, అజిత్ సంపన్నవర్గ భావజాలంతో మాట్లాడారని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. విద్య, వైద్యం, గృహవసతి వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అని, వాటిని అజిత్ చారిటీ అనుకుంటున్నారని, ఆయనకు పేద ప్రజల కష్టాలు తెలియవని కొందరు పోస్ట్లు పెట్టారు. కార్పొరేట్లకు, బడా పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వాలను ప్రశ్నించకుండా సమాజంలోని బలహీన వర్గాలకు మేలు చేసే ఉచిత పథకాలపై అజిత్ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.