గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలిపించామా అని తెలంగాణ ప్రజలు రంధి పడుతున్న సందర్భంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చి కాంగ్రెస్ పార్టీని తికమక పెడుతున్నది. రేవంత్ పాలనలో హామీల వైఫల్యాల వల్ల నిరాశలో ఉన్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు మరో విజయాన్ని అందించేందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీకి జ్వరం పట్టుకొనే పరిస్థితి ఉన్నది. అందుకే, ఏదో ఒక సాకుతో స్థానిక ఎన్నికలు దూరం జరిగేలా చూస్తున్నది. అనుకోని పరిస్థితుల్లో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ పాలనకు ఒక పరీక్షే. ఈ ఒత్తిడిలో రేవంత్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తెలంగాణ రాష్ర్టానికి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ఎన్నికలో తలపడుతున్న నవీన్ యాదవ్ కుటుంబ చరిత్ర నేరపూరితమైనది. ఆయన నామినేషన్‌కు వెంట వచ్చిన సమూహంలో ఎందరో రౌడీ షీటర్స్ ఉన్నారని తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించవచ్చని ముందు జాగ్రత్తతో నియోజకవర్గ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేసుకున్నారు. నవీన్ యాదవ్ తండ్రి చిన శ్రీశైలం యాదవ్‌పై కూడా ఎన్నాళ్లుగానో రౌడీ షీట్ ఉన్నది. ఆయన అక్టోబర్ 27 నాడు బోరబండ పోలీస్ స్టేషన్లో బైండోవర్ అయ్యారు. నవీన్ బాబాయి రమేష్ యాదవ్ కూడా రౌడీ షీట్ కారణంగా బైండోవర్ అయ్యారు. తనపై 7 కేసులు పెండింగ్ ఉన్నాయని నవీన్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
స్థానిక యువకుడైన నవీన్ కుమార్ మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2014 శాసనసభ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసి దివంగత మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. ఆయనకు 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా 3వ స్థానంలో నిలిచారు. 2023 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాక కాంగ్రెస్ పార్టీలో చేరాలని మహమ్మద్ అజారుద్దీన్ కోరడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకొని నవంబర్ 2023లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వ్యక్తి గుణగణాలు, చరిత్రను వదిలేసిన కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నవీన్‌ను ప్రకటించింది. ప్రచార సమయంలోనే ఇది నా అడ్డా అని బాహాటంగా బెదిరింపులకు దిగుతున్న నవీన్ గెలిస్తే ఆ మాటలు మరింత రాటుదేలవచ్చు.
ఓటమి భయంతో రేవంత్ మరో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అయిన మహమ్మద్ అజరుద్దీన్‌కు ఎకాఎకీన మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ క్రీడాకారుడి చరిత్రలోనూ మరకలున్నాయి. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆయనపై బీసీసీఐ జీవితకాలపు నిషేధాన్ని విధించింది. ఏ దేశం జట్టులో ఆడుతున్నారో అదే జట్టు ఓటమి కోసం డబ్బులు తీసుకొని పనిచేయడమే మ్యాచ్ ఫిక్సింగ్. 2012లో ఆ నిషేధాన్ని ఏపీ హైకోర్టు తొలగించింది. 2019లో హెచ్‌సీఏ అధ్యక్షుడిగానూ అజర్ వివాదాలు ఎదుర్కొన్నారు. ఉప్పల్ స్టేడియంకు చెందిన రూ.20 కోట్ల దాకా నిధుల దుర్వినియోగానికి ఆయన పాల్పడ్డారని 2023లో హైదరాబాద్ పోలీసులు ఆయనపై 4 కేసులు నమోదు చేశారు. ఏడాది క్రితం ఆయనకు ఈడీ సమన్లు అందాయి. ఈ నేపథ్యం గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి అడ్డంకిగా మారితే ఆయన మంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అవుతుంది. అంతేకాకుండా అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రజలతో ఎలాంటి అనుబంధం లేదనే చెప్పాలి. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన పాత్ర శూన్యమే. తెలంగాణ సమస్యలు, కాంగ్రెస్ హామీల గురించి కూడా ఎలాంటి అవగాహన లేదు. జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓట్ల కోసం తెలంగాణ భవిష్యత్తుతో కాంగ్రెస్ ఆడుకుంటున్నది.
గత ఎన్నికల్లో ఇదే జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీచేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. మరోసారి ఆయనకే టికెట్ ఇస్తే ఈసారి కూడా ఎంఐఎం పోటీలో ఉండేది. రహస్య ఒప్పందంలా అసదుద్దీన్ ఒవైసీ కోరిన అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి, అసద్ వ్యతిరేకించే అజర్‌కు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పాతకాపుల నుంచి మరింత వ్యతిరేకతను రేవంత్ పెంచుకున్నారనక తప్పదు. మరోవైపు ఆరు నెలల్లో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేసే కొత్త కార్యాన్ని కాంగ్రెస్ నెత్తిపై పెట్టారు. అజర్ మంత్రిగా సమర్థుడు, జనం మెచ్చే నాయకుడే. అయితే, ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆయనకే ఇవ్వాల్సింది. ఎన్నికల్లో గెలుస్తాడన్న నమ్మకం లేని ఆయన్ని మంత్రిగా చేయడం వల్ల తెలంగాణకు జరిగే మేలు ఏమిటో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.
గత ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు కంటోన్మెంట్లో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. అది నిజమైతే, వాటి వివరాలు బయటపెట్టమని బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుతున్నారు. సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును రేవంత్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను అడ్డుకున్న వారిని మూసీలో తొక్కేస్తామని ఆవేశంగా అన్నారు. ఇది కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నది. మరోచోట పీజేఆర్ విగ్రహం ప్రస్తావన తెచ్చారు. సినీ కార్మికులు ఉన్న ప్రాంతం కూడా కావడంతో సినిమా మంత్రి లేకుండానే అర్జెంటుగా వారితో ఓ సమావేశం ఏర్పాటుచేసి హామీలు గుప్పించారు. ఓట్ల కోసం నియోజకవర్గాన్ని వర్గాలుగా చీల్చి తెలంగాణ ఉనికికే మచ్చ తెస్తున్నారు.
ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ మంత్రులను, నేతలను పింఛన్ పెంపు, తులం బంగారం, అమ్మాయిలకు స్కూటీలు ఏమాయె అని ప్రజలు నిలదీస్తున్నారు. వీటికి సమాధానం వారి దగ్గర లేదు. రోజురోజుకు పెరుగుతున్న నెగిటివ్ ఓటును తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తున్నది. మరోవైపు ఉత్తుత్తి బీసీ బిల్లుతో బీసీలు కాంగ్రెస్‌పై కోపంగా ఉన్నారు. ఇలా ఓ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నది.
– బద్రి నర్సన్