UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో దాయాది పాకిస్థాన్ (Pakistan)ను భారత్ (India) మరోసారి ఎండగట్టింది. శాంతి గురించి బహిరంగంగా చర్చ సందర్భంగా జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan)ను జైలుకి పంపి.. అతడికి విరోధి అయిన ఆసిమ్ మునీర్ (Asim Munir)కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందంటూ చురకలంటించింది.
‘లీడర్షిప్ ఫర్ పీస్’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహిరంగ చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందంటూ ఆరోపణలు చేశారు. పాక్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని (Harish Parvathaneni) మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్, లఢఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని, వాటిని విడదీయలేమని పునరుద్ఘాటించారు. భారత్‌కు, దేశంలోని ప్రజలకు హానికలిగించడంపైనే పాక్ దృష్టి ఉంటుందని విమర్శించారు.
ఇక సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఎందుకు ముగించిందో కూడా ఈ సందర్భంగా హరీష్ పర్వతనేని వివరించారు. భారత్ 65 ఏళ్ల కిందట విశ్వాసం, సంకల్పం, స్నేహ స్ఫూర్తితో సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు. ఈ ఆరున్నర దశాబ్దాలుగా భారత్‌పై పాక్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రదాడులకు పాల్పడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. గత నాలుగు దశాబ్దాల్లో పాక్ జరిపిన ఉగ్రదాడుల్లో పదివేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని కూడా పర్వతనేని హరీష్ ప్రస్తావించారు. ఈ దాడిలో ఓ విదేశీయుడు సహా 26 మంది పౌరులు మరణించినట్లు గుర్తు చేశారు. అందుకే ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాదానికి మద్దతును ముగించే వరకూ ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేస్తామని ప్రకటించినట్లు వివరించారు. పాక్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చిన భారత్ దాన్ని శక్తిమంతంగా ఎదుర్కొంటుందన్నారు.
అంతటితో ఆగకుండా.. పాకిస్థాన్‌లోని ప్రజాస్వామ్యం, రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ఎత్తిచూపారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపి, అతనికి విరోధి అయిన ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేతుల్లో సర్వాధికారాలు పెట్టిందని విమర్శించారు. దీన్నిబట్టే ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
Also Read..
Plane Crashes | ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. ఏడుగురు దుర్మరణం.. వీడియో
ప్రీడయాబెటిస్ నయమైతే,58% తగ్గనున్న ‘గుండె’ ముప్పు!
హెచ్-1బీ ‘వెట్టింగ్’ ప్రారంభం