వాషింగ్టన్: హెచ్-1బీ, హెచ్-4 వీసాల దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాల ప్రాథమిక వడపోత, క్షుణ్ణమైన తనిఖీలను అమెరికా ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించింది. ట్రంప్ ప్రభుత్వం వలసలపై కొరడాను ఝళిపిస్తున్న నేపథ్యంలో స్టేట్ డిపార్ట్మెంట్ ఈ నెల 3న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అమెరికన్ వీసాను పొందడం గొప్ప అవకాశమని, అది ఒక హక్కు కాదని ఈ ఆదేశాలు పేర్కొన్నాయి. అమెరికాలోకి అనుమతించదగని వారిని గుర్తించేందుకు లోతుగా తనిఖీలు చేస్తున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులపై ఆధారపడినవారు హెచ్-4 వీసా కోసం దరఖాస్తు చేస్తారు. హెచ్-1బీ, హెచ్-4, ఎఫ్, ఎం, జే నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులందరూ తమకు గల అన్ని సామాజిక మాధ్యమాల ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్‌ను ‘పబ్లిక్’కు మార్చాలని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ నెల 3న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. పూర్తి స్థాయి తనిఖీలు (వెట్టింగ్)లో అందుబాటులో ఉన్న అన్ని రకాల సమాచారాన్ని ఉపయోగించుకుని అమెరికాలోకి అనుమతించదగని వారిని గుర్తిస్తామని తెలిపింది.