లండన్: ప్రీడయాబెటిస్ను నయం చేసుకోగలిగిన వారికి హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు 58 శాతం మేరకు తగ్గుతుంది. లండన్లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కన్నా అధికంగా ఉండటాన్నే ప్రీడయాబెటిస్ అంటారు. ఇది పూర్తి స్థాయి మధుమేహం కాకపోయినప్పటికీ, తీవ్రమైన గుండె సమస్యలకు దారి తీయవచ్చు. ప్రీడయాబెటిస్ను నయం చేసుకుంటే, తక్షణ గుండె పోటు ముప్పును తగ్గించుకోవడం మాత్రమే కాకుండా దీర్ఘ కాలంలో గుండెను కాపాడుకోవచ్చునని అధ్యయనకర్తలు తెలిపారు. వైద్య సలహా మేరకు మెరుగైన ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువగా కదలడం, బరువును తగ్గించుకోవడం వంటి కార్యకలాపాలను చేయాలని సూచించారు.