కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పల్లె పోరులో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి, రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట్టింపు స్థాయిలో గెలుచుకొని తన బలాన్ని నిరూపించుకున్నది. 227 పంచాయతీల్లో పోలింగ్ జరుగగా, 89 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బీజేపీ నుంచి 27, స్వతంత్రులు 54 మంది గెలుపొందగా, కాంగ్రెస్ మాత్రం 52 సీట్లతో రెండో స్థానానికి పరిమితం కావడంపై ఆ పార్టీ శ్రేణులను అసంతృప్తికి గురి చేస్తున్నది. ఇక హస్తం నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ప్రజానీకం గులాబీ జెండాకే జై కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నది.
జిల్లాలో మొదటి విడుతలో లింగపూర్, సిర్పూర్-యు, జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి 40 చోట్ల గెలుపొందగా, అధికార కాంగ్రెస్ 31, బీజేపీ 5, ఇతరులు 33 స్థానాల్లో విజయం సాధించారు. ఇక ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రధానంగా ఏజెన్సీ మండలాల్లోని గిరిజనులు, ఆదివాసీలు బీఆర్ఎస్కు అత్యధిక స్థానాలు అందించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను చూసి ఛీత్కరించిన ప్రజలు, ఈ ఎ న్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారు. మొదటి, రెండు విడుతల్లో జరిగిన ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రె స్కు రాబోయే రోజుల్లో గడ్డుకాలమేనని తెలుస్తున్నది. రోజు రోజుకూ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నట్లు ఈ ఎన్నికల్లో తేలిపోయింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడుతలో బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికల్పేట్, కౌటాల, సిర్పూర్-టీ మండలాల్లోని 113 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 49 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు, బీజేపీ 22, స్వతంత్రులు 21 స్థానాల్లో గెలుపొందారు. గ్రామ స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతున్నది. బీఆర్ఎస్ విజయం కోసం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం చేయగా, ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనపై నెలకొన్న అసంతృప్తి బయటపడింది.
అధికార కాంగ్రెస్‌పై గ్రామీణ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి ఉందన్న విషయాన్ని ముందుగానే అంచనా వేసిన ఆ పార్టీ నేతలు అత్యధిక స్థానాలు ఏకగ్రీవాలు చేయాలని కుట్రలు చేసినా కుదరలేదు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని నమ్మి ఏకగ్రీవాలకు అంగీకరిస్తే ప్రజల్లో మరింత దిగజారిపోవాల్సి వస్తోందని భావించిన ఇతర పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. ఏకగ్రీవాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా చోట్ల విజయం సాధించారు. ఇక బీజేపీ.. స్వతంత్య్ర అభ్యర్థులకు వచ్చినన్ని స్థానాలను కూడా కైవసం చేసుకోలేకపోయింది. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజానీకం బీఆర్ఎస్ వెంటే నడువడం ప్రాధాన్యం సంతరించుకున్నది.