మోచేతి నీళ్లను ధిక్కరించి
బరిగీసి కొట్లాడినం
వైరుధ్యాలన్నీ మరిచి ఒక్కటై
ఆత్మగౌరవ పతాకమై ఎగసినం
ఎగతాళి చేసిన వారి గుండెల్లో
పోరు గీతాలమై గర్జించినం
ఊరూవాడా తేడా లేకుండా
జంగు సైరన్ వినిపించినం
నిరసనలు నినాదాలే ఆయుధంగా
ఆశయం సిద్ధించే దాకా సాగినం
రాజ్యాంగమే ఆలంబనగా
చట్టబద్ధ రణమే చేసినం
ప్రాణాలను పణంగా పెట్టినం
జీవితాలను హననం చేసుకున్నాం
చావు నోట్లో తలను పెట్టి
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమైనాం
దేశం నోటి వెంట ‘జై తెలంగాణ’
నినాదం వెల్లువెత్తేదాక పోరు సల్పినం
దశాబ్దంగా ఒక్కటై వెలిగినం
తెలంగాణ పౌరుషం నిలిపినం!
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261