Dhaka : బంగ్లాదేశ్ (Bangladesh) లో శ్రీరాముడి విగ్రహం నిర్మాణం చుట్టూ అలుముకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రంగపూర్ (Rangapur) లో 81 అడుగుల భారీ రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్ ఛాందసవాదులు శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించారన్న ఆరోపణలతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజధాని ఢాకాలో వేల మంది హిందువులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ‘జై శ్రీరామ్ (Jai Sriram)’ నినాదాలతో ఢాకా వీధులు మారుమోగాయి.
హిందూ మహాజోత్ సహా పలు హిందూ సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. ఢాకాలోని షాబాగ్ కూడలిలో సమావేశమైన నిరసనకారులు, అక్కడి నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రెస్ క్లబ్ వెలుపల మానవహారం నిర్వహించగా.. ఢాకా రిపోర్టర్స్ యూనిటీ భవనం దగ్గర మరో నిరసన కార్యక్రమం జరిగింది. మరోవైపు రంగపూర్‌లో ప్రదర్శన చేపట్టేందుకు ప్రయత్నించిన హిందువులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్‌లోని ఉత్తర గైబంధా జిల్లా పలాశ్‌బరిలో శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఆలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా 81 అడుగుల శ్రీరాముడి విగ్రహంతోపాటు, 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 22 కోట్ల బంగ్లాదేశ్ టాకాల (సుమారు రూ.15.6 కోట్లు) అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రాముడి విగ్రహ నిర్మాణం ఇప్పటికే 80 శాతం పూర్తయింది.
అయితే ఇస్లామిక్ గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో పనులు నిలిపివేసినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిదాస్ చంద్రదాస్ తెలిపారు. ‘మేము భయంతో ఉన్నాం. ఆ భయాందోళనల వల్లే పనులను తాత్కాలికంగా నిలిపివేశాం’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. సనాతన ధర్మంలో కీలకమైన దైవం విగ్రహ నిర్మాణంలో ప్రధాని తారిఖ్ రెహమాన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలు, మత సామరస్యాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి మత విశ్వాసాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని కమిటీ సలహాదారు శ్యామ్‌లాల్ కుమార్ మహంత ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా, ఈ నెల ప్రారంభంలో గైబంధాలో ఇస్లామిక్ గ్రూపులు నిర్వహించిన నిరసనలో శ్రీరాముడి చిత్రపటంపై ఒక షూ ఉంచి అవమానించారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నిందితులను 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు అల్టిమేటం జారీచేశాయి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.