Israel Hamas War | జెరూసలేం/ గాజా, అక్టోబర్ 6: గత ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఏడాది కాలంగా రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది. పరస్పరం ప్రతీకార దాడులతో కొనసాగుతున్న పోరు సామాన్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నది. యుద్ధం వల్ల గాజాలో వేలాది మంది మృతి చెందగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పాలస్తీనా తరపున యుద్ధంలో ఇరాన్, హెజ్బొల్లా జోక్యం చేసుకోవడంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పశ్చిమాసియా రణ రంగంగా మారింది. దీనిపై ఐరాసతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధ విరమణకు అవి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ యుద్ధం గాజా, పాలస్తీనా, లెబనాన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. హమాస్ ఆరోగ్య శాఖ ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 41,700 మంది మరణించారు. యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటిదాకా జరిగిన ముఖ్యమైన ఘటనలను, పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం..
హమాస్ దాడితో ఆరంభం
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో 1205 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది సామాన్య పౌరులే. ఈ ఘటనలో హమాస్ 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లింది. ఇందులో ఇప్పటికీ 64 మంది నిర్బంధంలోనే ఉన్నారు. 117 మందిని విడిచిపెట్టారు. 70 మంది మరణించారు. దీంతో హమాస్‌ను అంతమొందిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రతిజ్ఞ చేశారు.
గాజాపై భూతల దాడులు
అక్టోబర్ 13న ఉత్తర గాజాలోని ప్రజలు దక్షిణ ప్రాంతం వైపు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అక్టోబర్ 27న భూతల దాడులు ప్రారంభించింది. నవంబర్ 15న గాజాలోని అతిపెద్ద దవాఖాన అల్-షిఫాపై ఇజ్రాయెల్ దాడి చేసింది.
బందీల మార్పిడి
నవంబర్ 24న హమాస్-ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగాయి. ఒప్పందం ప్రకారం హమాస్ 80 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని విడిచి పెట్టగా, తమ దేశ జైళ్లలో ఉన్న 240 పాలస్తీనియన్లను, 25 మంది ఇతర బందీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే వాటిలో చాలావాటిని ఇజ్రాయెల్ సమర్థంగా అడ్డుకొంది.
గాజా దక్షిణ ప్రాంతంపై దాడులు
మే 7న చాలా మంది శరణార్థులు తల దాచుకున్న గాజా దక్షిణ ప్రాంతంలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు ప్రారంభించింది. ఈజిప్ట్‌తో సరిహద్దు కలిగి ఉన్న ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకొని సాయం అందే మార్గాన్ని దిగ్బంధం చేసింది. జూలై 13న హమాస్ సైన్యాధిపతి మొహమ్మద్ డైఫ్ను అంతమొందించినట్టు ఇజ్రాయెల్ తెలిపింది.
భయం రేపిన ప్రాంతీయ హింస
ఇరాన్ అండ కలిగిన హౌతీ రెబెల్స్ సాయంతో యెమెన్ టెల్ అవీవ్‌పై చేసిన దాడికి ప్రతిగా జూలై 20న ఇజ్రాయెల్ యెమెన్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఇరాన్ మద్దతు కలిగిన హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య దాదాపు ప్రతిరోజూ పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయి. జూలై 30న బీరుట్‌పై జరిగిన దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫాద్ షుక్ మరణించారు. ఆ తర్వాతి రోజే హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియహ్ ఇరాన్లో జరిగిన ఒక దాడిలో చనిపోయారు. దీనికి ఇజ్రాయెలే కారణమని హమాస్ ఆరోపించింది.
సంధి చర్చలు విఫలం
ఆగస్టు 16న అమెరికా ప్రతిపాదించిన కొత్త సంధిని హమాస్ తిరస్కరించింది. ఆగస్టు 22న ఈజిప్ట్, ఖతార్ చర్చలకు మధ్యవర్తిత్వం వహించినా అవి విఫలమయ్యాయి. ఆగస్టు 25న లెబనాన్‌పై పెద్ద యెత్తున దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించగా.. వందలాది డ్రోన్లు, రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించామని హమాస్ తెలిపింది.
లెబనాన్‌లో పేజర్ల పేలుళ్ల కలకలం
సెప్టెంబర్ 17, 18న లెబనాన్‌లో వేలాది మంది హెజొల్లా సభ్యుల పేజర్లు, వాకీటాకీలు పేలి కనీసం 39 మంది మృతి చెందగా, మూడు వేల మంది గాయపడ్డారు. దీనికి తామే బాధ్యలమని ఇజ్రాయెల్ ప్రకటించకపోయినా గాజాపై యుద్ధాన్ని విస్తరిస్తామని ప్రకటించింది. లెబనాన్‌పై బాంబు దాడులు కొనసాగించింది. సెప్టెంబర్ 27న దక్షిణ బీరుట్‌పై దాడి చేసి హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను మట్టుపెట్టింది.
ప్రత్యక్షంగా రంగంలోకి ఇరాన్
నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రతిన బూనారు. నస్రల్లా, హనియా మృతికి బదులు తీర్చుకొనేందుకు అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది క్షిపణులతో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లో పరిమితంగా భూతల దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిన రోజే ఈ దాడి జరిగింది.
పేజర్ల పేలుడు వెనక 9 ఏండ్ల ప్లాన్
పేజర్లు, వాకీ టాకీలు పేలి హెజ్బొల్లాకు చెందిన 30 మంది మృతిచెందగా, వేలమంది గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ పేలుడు వెనుక ఇజ్రాయెల్ 9 ఏండ్ల ప్రణాళిక ఉన్నదట. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 2015లో ఇజ్రాయెల్‌కు చెందిన స్పై ఏజెన్సీ మొస్సాద్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ‘భవిష్యత్తులో హెజ్బొల్లాతో ఇబ్బందులు తలెత్తితే పేజర్లు, వాకీ టాకీలనే బాంబుగా మార్చే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇందుకోసం 9 ఏండ్లు శ్రమించారు. ఎక్కువ చార్జింగ్ ఇచ్చే పేజర్లు, వాకీ టాకీలను తయారుచేయాలని నిర్ణయించి, లావైన బ్యాటరీలను చేర్చి.. పేలుడు సంభవించే సాంకేతికతతో తయారుచేశారు.
అంటే.. అవి రెండు చేతులతో పట్టుకొనేలా ఉంటాయి. ఎందుకంటే.. పేలుడు సంభవిస్తే రెండు చేతులూ పోవాలన్న ఉద్దేశంతోనే. ఇక, అందులోనే మెసేజ్ డీ-ఎన్క్రిప్షన్ వ్యవస్థను కూడా చేర్చారు. సర్వేలెన్స్ కూడా ఉండదని నమ్మించి వారి చేతుల్లో పెట్టారు. అయితే, ఈ పేజర్ల ఎంపికలో ఉగ్రవాదులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇజ్రాయెల్‌తో సంబంధం లేని దేశాల వద్దే వీటిని కొనుగోలు చేయాలనుకున్నారు. అందుకే తైవాన్‌కు చెందిన అపోలో పేజర్లు ఆర్డర్ పెట్టారు. ఆ కంపెనీ పేజర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. తైవాన్ కంపెనీకి చెందిన మహిళ మధ్యప్రాచ్య దేశాలకు సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే హెజ్బొల్లాకు కావాల్సిన పేజర్లు, వాకీటాకీలు సరఫరా చేశారు. కానీ, అది ఇజ్రాయెల్ ఆపరేషన్ అన్న విషయం ఆ మహిళకు కూడా తెలియదు’ అని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొన్నది.