Benjamin Netanyahu | జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ నివాసమే లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడి జరిగింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ఈ దాడికి పాల్పడింది. సీసరియాలోని నెతన్యాహూ ఇంటి సమీపంలోని ఓ ఇంటి వద్ద డ్రోన్ పేలింది. దీంతో ఆ ప్రాంతంలో సైరన్లు మోగాయి. ఈ ఘటన జరిగినప్పుడు నెతన్యాహూతో పాటు ఆయన భార్య ఇంట్లో లేరని ప్రధానమంత్రి అధికార ప్రతినిధి ప్రకటించారు. డ్రోన్ దాడితో ఓ భవనం పాక్షికంగా ధ్వంసమైందని, ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక మీడియా వెల్లడించింది. హెజ్బొల్లా ప్రయోగించిన మరో రెండు డ్రోన్లను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ అధినేత యహ్యా సిన్వర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించిన రెండో రోజే ఈ దాడి జరిగింది.
యుద్ధాన్ని గెలవబోతున్నాం: నెతన్యాహూ
తన ఇంటిని లక్ష్యంగా చేసుకొని జరిగిన డ్రోన్ దాడిపై నెతన్యాహూ స్పందించారు. తనను ఏదీ నిరోధించలేదని, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలవబోతున్నదని పేర్కొన్నారు. ‘మన మగవారి తలలు నరికిన, మహిళలను అత్యాచారం చేసిన, బిడ్డలను ప్రాణాలతో తగలబెట్టిన దుండగులకు ఉగ్రవాద మాస్టర్‌మైండ్(సిన్వర్)ను అంతం చేశాం. ఇరాన్ పరోక్ష ఉగ్రవాద సంస్థలతో మా యుద్ధం కొనసాగుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. డ్రోన్ దాడిలో ఇరాన్ హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది.
ఇజ్రాయెల్ దాడుల్లో 44 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. శనివారం ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడ్డాయి. శరణార్థ శిబిరాలతో పాటు దవాఖానాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 44 మంది మరణించడంతో పాటు 80 మంది గాయపడ్డట్టు స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్‌పైకి సిరియా సైతం వైమానిక దాడులకు దిగింది. అయితే, ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
గన్‌షాట్ వల్లే సిన్వర్ మృతి
ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమైన హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్ గాయం కారణంగానే అతడు మృతి చెంది ఉంటాడని పోస్టుమార్టం నిర్వహించిన ఇజ్రాయెల్ వైద్యుడు డాక్టర్ చెన్ కుగెల్ తెలిపారు. ట్యాంక్ లేదంటే, మిసైల్ నుంచి వచ్చిన షెల్ వల్ల ఆయన చేతికి గాయమైందని, రక్తస్రావాన్ని ఆపేందుకు చేతి చుట్టూ ఓ వైర్‌ను చుట్టుకున్నాడని తెలిపారు.
హమాస్ ఉనికికి ఢోకా లేదు: ఖమేనీ
హమాస్ ఉనికిలోనే ఉందని, ఎప్పటికీ ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు. హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడంపై ఆయన స్పందిస్తూ ఆయన మృతి చెందినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదని, హమాస్ ఉనికికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య సయోధ్య కష్టమే
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఒప్పందం కుదర్చడం కంటే ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య రాజీ జరపడమే సులువని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో బైడెన్‌తో పాటు బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మన్ చాన్స్‌లర్ ఒలాప్ షోల్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం త్వరలోనే జరిగే అవకాశాలున్నాయని చెప్పారు.