Israel Hezbollah War | జెరూసలేం, అక్టోబర్ 5: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ అధికారి సయీద్ అతల్లా అలీ హతమయ్యాడు. ఉత్తర లెబనాన్‌లో ఓ శరణార్థి క్యాంప్‌పై జరిపిన వైమానిక దాడుల్లో అతడితోపాటు కుటుంబ సభ్యులంతా మరణించినట్టు హమాస్ శనివారం ప్రకటించింది. శనివారం ఉదయం లెబనాన్‌పై ఇజ్రాయెల్ 12 వైమానిక దాడులతో విరుచుకుపడింది. వైమానిక దాడుల్లో సిరియా, లెబనాన్‌ను కలిపే ప్రధాన రహదారి ధ్వంసమైంది. హెజ్బొల్లాను పూర్తిగా తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతున్నది.
లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ పదాతి దళం రంగంలోకి ప్రవేశించనున్నదని, మంగళవారం నుంచి లెబనాన్‌లోకి అడుగుపెట్టబోతున్నదని తెలిసింది. అక్టోబర్ 7 దాడుల తర్వాత లెబనాన్ సరిహద్దు వెంబడి ప్రతిరోజూ హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మిలటరీకి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. యుద్ధంలో ఇప్పటివరకు 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఇందులో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు.