జెరూసలేం : ఇజ్రాయెల్ను పరిగణనలోకి తీసుకోకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడం ఇజ్రాయెల్లో రాజకీయంగా దుమారం రేపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా విఫలమయ్యారని విపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. ‘నెతన్యాహు అహంకారం, నిర్లక్ష్యం, ప్రణాళిక లేకపోవటం వల్ల ఏర్పడిన నష్టమిది. దీనిని పూడ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది’ అని విపక్ష నేత యైర్ లాపిడ్ విమర్శలు గుప్పించారు.
‘మనదేశ చరిత్రలో ఇలాంటి రాజకీయ విపత్తు ఎన్నడూ సంభవించలేదు. జాతీయ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలోను ఇజ్రాయెల్ను లెక్కలోకి తీసుకోలేదు. ఇదంతా ప్రధాని నెతన్యాహు దౌత్య వైఫల్యం వల్లే’ అని అన్నారు. సైన్యం తన పనులన్నీ పూర్తిచేసిందని, ప్రజలు ఎంతో నిబ్బరాన్ని కనబర్చారని లాపిడ్ అన్నారు. అయితే, నెతన్యాహు నిర్దేశించుకున్న లక్ష్యాల్లో దేనినీ సాధించలేకపోయారని ఆయన అరోపించారు.