న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ రవాణా రుసుమును వసూలు చేయనున్నది. ఈ 34 కిలోమీటర్ల వెడల్పైన జలసంధి ఒమన్, ఇరాన్ ఉభయదేశాల ప్రాదేశిక జలాల పరిధిలో ఉంది. అంతర్జాతీయ జలమార్గంగా పరిగణించే ఈ జలసంధిలో గతంలో ఈ రెండు దేశాల్లో ఏదీ రవాణా రుసుమును విధించలేదు. ఫిబ్రవరి 28న ప్రారంభమై ఏప్రిల్ 7 వరకు సాగిన ఈ యుద్ధం దేశ రక్షణ, పాలన, పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం చేకూర్చింది. హొర్ముజ్ జలసంధి రవాణా రుసుము ద్వారా వచ్చే నిధులను యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు ఇరాన్ అధికారులు చెప్పినట్లు ఏపీ వార్తాసంస్థ వెల్లడించింది. 40 రోజుల యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ బుధవారం తెల్లవారుజామున కాల్పుల విరమణకు అంగీకరించాయి. గడచిన 40 రోజులుగా మూగపడిన జలమార్గాన్ని షరతులతో తిరిగి తెరువడానికి ఇరాన్ ఒప్పుకుంది. ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి.
ఇస్లామాబాద్‌లో శుక్రవారం అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ప్రారంభం కానున్న చర్చల్లో హొర్ముజ్ జలసంధి భవిష్యత్తు, దీర్ఘకాలిక శాంతికి సంబంధించిన ఇతర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చర్చలకు ఆచరణీయమైన ప్రాతిపదికగా ఉండే 10 అంశాల ప్రతిపాదనను ఇరాన్ సమర్పించిందని, ఈ రెండు వారాల వ్యవధిలో ఒప్పందం ఖరారై, పూర్తి అవుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఇరాన్ నుంచి మాకు 10 అంశాల ప్రతిపాదన అందింది. చర్చలు జరపడానికి ఇది ఆచరణయోగ్యమైన ప్రాతిపదిక అని విశ్వసిస్తున్నాము. అమెరికా, ఇరాన్ మధ్య గతంలోని వివిధ వివాదాంశాలలో దాదాపు అన్నింటిపై అంగీకారం కుదిరింది. కాని రెండు వారాల గడువు ఈ ఒప్పందాన్ని ఖరారు చేసి పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది అని ట్రంప్ చెప్పారు. అయితే ఆ అంశాలను ఆయన విశదీకరించలేదు.
రాయిటర్స్ కథనం ప్రకారం ఓడ రకం, దానిలోని సరుకు, ఇతర పరిస్థితులను బట్టి రవాణా రుసుము మారుతూ ఉంటుంది. ఈ విషయంలో ఇరాన్ ఒమన్‌తో ఒక ప్రొటోకాల్‌ను రూపొందిస్తున్నదని, ఈ చర్య రవాణాను పరిమితం చేయడానికి కాకుండా సులభతరం చేయడానికి ఉద్దేశించిందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాదీ గత వారం తెలిపారు. అయితే యూఏఈ, ఖతార్ సహా గల్ఫ్ దేశాలు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. స్వేచ్ఛాయుత, బహిరంగ నౌకాయానానికి పిలుపునిస్తూ ఆర్థిక యంత్రాంగాలపై ఎలాంటి చర్చ అయినా వాయిదా వేయాలని ఆ దేశాలు సూచించాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాన్ని నియంత్రించే ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ఒప్పందం ప్రకారం జలసంధుల సరిహద్దు దేశాలు కేవలం ప్రయాణానికి అనుమతి ఇచ్చినందుకు రుసుమును డిమాండ్ చేయలేవు. అయితే ఏ ఒక్క నిర్దిష్ట దేశానికి చెందిన నౌకలపైన ఈ రుసుములను అధికంగా విధించకూడదనే షరతుకు లోబడి, పైలటింగ్, టగ్గింగ్ లేదా పోర్ట్ సేవలు వంటి నిర్దిష్ట సేవల కోసం వారు పరిమిత దేశాలకు విధించవచ్చు.
హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై రవాణా రుసుమును వసూలు చేయాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఒమన్ తీవ్రంగా వ్యతిరేకించింది.