Gaza | జెరూసలేం, ఆగస్టు 10: గాజాలో శరణార్థులు తలదాచుకున్న ఓ స్కూల్పైనా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా వైమానిక దాడులకు తెగబడింది. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం 80 మంది చనిపోయి ఉంటారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత 10 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇది అత్యంత దారుణమైన ఘటనగా వారు పేర్కొన్నారు. గుర్తించలేని విధంగా మృతదేహాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే సెంట్రల్ గాజాలోని తబీన్ స్కూల్లో హమాస్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుందని, అందుకే దాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ మిలటరీ వర్గాలు తమ చర్యల్ని సమర్థించుకున్నాయి.
కాగా, ఇజ్రాయెల్ ప్రకటనను హమాస్ ఖండించింది. యుద్ధంలో శరణార్థులుగా మారిన ప్రజలు ఆ స్కూల్లో తలదాచుకున్నారని తెలిపింది. క్షిపణి దాడుల్లో 47 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడికి తెగబడిందని ఆరోపించింది. గత 8 రోజుల్లో స్కూళ్లపై జరిగిన వైమానిక దాడుల్లో 163 మంది చనిపోయారు. వీటిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.