Hezbollah-Israel Strikes | జెరూసలేం, ఆగస్టు 25: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పటికే కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉందన్న భయాందోళనలు నెలకొన్నాయి. గత నెలలో తమ టాప్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భూభాగంపైకి వందలాది సంఖ్యలో రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్, గోలన్ హైట్స్‌లోని ఆ దేశ సైనిక స్థావరాలు, ఐరన్ డోమ్ లక్ష్యంగా చేసుకొని 320 కత్యూషా రాకెట్లు, భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించినట్టు వెల్లడించింది. ప్రతీకార మొదటి దశ దాడులను ముగించామని, భవిష్యత్తులో మరిన్ని దాడులు ఉంటాయని పేర్కొన్నది.
డ్రోన్లు 11 టార్గెట్లను నాశనం చేశాయని హెజ్బొల్లా పేర్కొన్నది. హెజ్బొల్లా దాడులను అడ్డుకొనేందుకు దక్షిణ లెబనాన్‌లోని వేలాది రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకొని దాదాపు 100 యుద్ధ విమానాలు వైమానిక దాడులు చేశాయని ఇజ్రాయెల్ పేర్కొన్నది. దాదాపు ఉదయం 10 గంటల సమయానికి ఈ రెండు వైపుల దాడులు అగినప్పటికీ, పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు హెజ్బొల్లా గ్రూపు, ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించారని, ఇద్దరికి గాయాలయ్యాయని లెబనాన్ అధికారులు పేర్కొనగా, స్వల్ప నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాగా, హెజ్బొల్లా వద్ద దాదాపు 1,50,000 రాకెట్లు ఉన్నాయని, ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఆ గ్రూపునకు ఉన్నదని ఒక అంచనా.
ఎయిర్‌పోర్టు మూసివేత.. సర్వీసుల మళ్లింపు
హెజ్బొల్లా దాడుల నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. బెన్-గురియోన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. దాడి ముప్పు నేపథ్యంలో గంట పాటు విమానాలను దారి మళ్లించారు. బాంబ్ షెల్టర్లకు సమీపంలో ఆశ్రయం తీసుకోవాలని ఇజ్రాయెల్ హోం ఫ్రంట్ కమాండ్ ప్రజలకు సూచించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత 10 నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు మరో దఫా చర్చలను ఈజిప్టు నిర్వహిస్తున్న సమయంలో ఈ పరస్పర దాడులు చేసుకోవడం గమనార్హం.
ఇజ్రాయెల్‌లో 48 గంటల ఎమర్జెన్సీ
తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో 48 గంటల పాటు దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాల్లంట్ ఆదివారం ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి ఇది అమల్లో ఉంటుందని తెలిపారు. సైన్యం కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు, ప్రజలు గూమిగూడకుండా నియంత్రించేందుకు ఈ చర్య చేపట్టినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ పౌరులపై దాడులు చేసేందుకు హెజ్బొల్లా ప్రణాళికలు వేసిందని అంతకుముందు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియెల్ హగని పేర్కొన్నారు.
ప్రతిదాడులు తప్పవు: నెతన్యాహూ
తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించిన వేలాది రాకెట్లను సైన్యం అడ్డుకొన్నదని ఆయన పేర్కొన్నారు. సైన్యం సూచనలను పాటించాలని పౌరులను కోరారు. ‘మా దేశాన్ని రక్షించుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటాం. మాపై ఎవరు దాడి చేస్తారో, వారిపై మేం దాడి చేస్తాం అనే సాధారణ నియమాన్ని పాటిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
హెజ్బొల్లా అమ్ములపొదిలో ‘కత్యూషా’
హెజ్బొల్లా గ్రూపు అమ్ములపొదిలో ‘కత్యూషా’ అనేది ప్రధాన ఆయుధంగా ఉన్నది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్లు దీన్ని తయారు చేశారు. ఈ రాకెట్‌కు కత్యూషా అనే పేరు ఓ యుద్ధ పాట నుంచి వచ్చింది. కత్యూషా రాకెట్లు భారీ వార్హెడ్లను సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించగలవు. ఏకకాలంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే అవకాశం ఉండటంతో శత్రు లక్ష్యాలను నాశనం చేయగలవు. వీటిని కొన్ని రకాల రహస్య లాంచర్లపై ఉంచి గుర్తు తెలియని ప్రదేశాల నుంచి హెజ్బొల్లా ప్రయోగిస్తుంది. 2006లో లెబనాన్ యుద్ధంలో వీటిని భారీయెత్తున వినియోగించారు.