న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సీనియర్ నాయకత్వానికి, పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మధ్య విభేదాలు ఏర్పడినట్లు ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తనను తప్పించిన తర్వాత మొదటిసారి చద్దా స్పందించారు. నా నోరు మూయించారు. కాని నేను ఓడిపోలేదు. ఇదే ఆమ్ ఆద్మీకి నా సందేశం అని శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో చద్దా పేర్కొన్నారు. తనపై పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను తాను సభలో ప్రస్తావించానని, అది ఏ విధంగా పార్టీకి హానికరమని ఆయన నిలదీశారు. నా గొంతును నొక్కడానికి ప్రయత్నించిన వారు అది నా ఓటమిగా భావించకూడదు. నేను నది లాంటి వాడిని. సమయం వచ్చినపుడు వరదగా మారగలను అని ఆయన హెచ్చరించారు.
సభలో తాను మాట్లాడేందుకు అనుమతించవద్దని రాజ్యసభ సచివాలయానికి లేఖ ఎందుకు రాయవలసి వచ్చిందని చద్దా ప్రశ్నించారు. తాను సామాన్య ప్రజలకు సంబంధించిన సమస్యలను మాత్రమే ప్రస్తావించానని ఆయన చెప్పారు. ఎయిర్పోర్టుల వద్ద ఆహారం ధరలు ఎక్కువగా ఉండడం, డెలివరీ ఏజెంట్లు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆహార కల్తీ, టోల్ చార్జీలు, బ్యాంకు పెనాల్టీలు, టెలికం విధానాలు వంటి సమస్యలను తాను సభలో ప్రస్తావించానని ఆయన తెలిపారు. అయితే ఈ వీడియోలో ఆయన ఏ పార్టీ నాయకుడి పేరు కాని తన భవిష్యత్ ప్రణాళికలు కాని ప్రస్తావించలేదు.
రాఘవ్ చద్దా వీడియోపై ఆప్ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. తాము మెతక పౌర సంబంధాలు పెట్టుకోమని ఆయన చురకలు అంటించారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి అనురాగ్ ధండా స్పందిస్తూ పార్లమెంట్లో పార్టీ అంశాలను ప్రస్తావించడంలో చద్దా విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ ప్రతిపాదనలను సమర్థించడం మాని ఎయిర్పోర్టు క్యాంటీన్లలో సమోసాల ధరలు తగ్గించాలి వంటి అంశాలపై చద్దా దృష్టి పెట్టారని ఆయన ఆరోపించారు. సభలో పార్టీ తీసుకువచ్చిన ప్రతిపాదనపై సంతకం చేయడానికి కూడా చద్దా నిరాకరించారని ధండా చెప్పారు.