హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ, ఆరెస్సెస్‌లో పనిచేసిన వ్యక్తులను రాష్ర్టాలకు కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడంపై పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ మాజీ నాయకుడు అమరీందర్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పలు అంశాలపై కాం గ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఘాటైన లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురించి ప్రస్తావించారు. ఆరెస్సెస్ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డిని తెలంగాణ టీపీసీసీ చీఫ్‌గా, బీజేపీ నుంచి వచ్చిన నానా పటోల్‌ను మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా ఎలా నియమించారని ప్రశ్నిం చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రేవంత్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ తరుణంలో అమరీందర్‌సింగ్ లేఖ సంచలనంగా మారింది. ఆరెస్సెస్ మూలాలున్న రేవంత్‌రెడ్డి నిజంగానే బీజేపీతో అంటకాగుతున్నట్టు హుజూరాబాద్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై బుధవారం కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో పార్టీ సీనియర్లు రేవంత్‌ను నిలదీసినట్టు తెలిసింది. బీజేపీకి మేలు చేసేందుకు రేవంత్ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొంటున్నారని ఆరోపించినట్టు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ బీజేపీలో అంతర్భాగం అవుతుందని పలువురు పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.