హైదరాబాద్, నవంబర్14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగంలో అద్వితీయమైన ప్రగతిని సాధించిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పూర్తవుతున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ తపనకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణ అని చెప్పారు.
తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాసాగర్‌రావు జయంతిని ఇరిగేషన్ డేగా నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకాలం నుంచీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు. తెలంగాణ నీటి హక్కుల సాధనకు విద్యాసాగర్‌రావు చేసిన కృషిని తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ కొనియాడారు. రాష్ర్టాల నీటి హక్కులను కాలరాసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఇంజినీర్లు భగ్నం చేయాలని అన్నారు.
జాజిరెడ్డిగూడెంలోని విద్యాసాగర్‌రావు సొంత స్థలంలో నిర్మించిన కల్యాణమండపాన్ని త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఒడిసిపడుతున్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకొనేందుకు వాటర్ యూనివర్సిటీలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ పేర్కొన్నారు. నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు పంటల సాగులోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నిరంజన్‌రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.
తొలుత జలసౌధలో ఇంజినీర్ విద్యాసాగర్‌రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విశ్వేశ్వరయ్యభవన్‌లో టెక్నికల్ సెషన్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డెసిషన్ సపోర్ట్ సిస్టమ్‌పై రామగుండం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు, గోదావరి-కావేరి నదుల అనుసంధానం పట్ల ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన అధ్యయనంపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఉత్తమ ఇంజినీర్లుగా ఎంపికైన జగిత్యాల చీఫ్ ఇంజినీర్ కే సుధాకర్‌రెడ్డి, ఇంటర్‌స్టేట్ వాటర్ రిసోర్స్ విభాగం సీఈ కోటేశ్వర్రావు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీఈఈ ఎం నీలిమకు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్ జ్ఞాపికలను అందజేశారు. శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.