గంగాధర, మార్చి 14 : రైతన్న రెక్కల కష్టం వృథా అవుతున్నది. రేయింబవళ్లు శ్రమించి వేసిన పంట చేతికందే దశలో చేజారిపోతున్నది. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో బంగారు పంటలు పండించిన గర్శకుర్తిలో సాగునీటి గోస తీవ్రమైంది. సాగుకు నీరందక.. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక కండ్ల ముందే పంట ఎండిపోతుండగా, రైతు ఆవేదన అరణ్య రోదనగా మారింది. నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ పూర్తి చేస్తే ఈ గ్రామం సస్యశ్యామలం కానుండగా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దాదాపు వంద ఎకరాల్లో పంట ఎండిపోయిందని కన్నీరుపెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రంది లేకుండా సేద్యం చేశామని, 365 రోజులు సమృద్ధి జలాలతో పంటలు పండించుకున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితి తారుమారైందని, పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన పొలాలను మూగ జీవాల మేతకు వదిలేస్తున్నారు.
ఈ చిత్రంలోని రైతు పేరు లింగపెల్లి రాములు. ఊళ్లో మూడెకరాల భూమి ఉండగా, రెండెకరాల్లో పొలం ఎండిపోగా, ఎడ్ల మేతకు వదిలేశాడు. మరో ఎకరం పొలాన్ని బావిలో ఉన్న కొద్దిపాటి నీటితో అరుతడులు పెట్టుకుంటూ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరో 10 రోజుల్లో నీరు రాకపోతే ఈ ఎకరం కూడా చేతికాదని, తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
ఈ చిత్రంలో ఎండిన పొలంలో ఏడుస్తున్న రైతు పేరు ఎట్టెపు ఆదిరెడ్డి. గర్శకుర్తిలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. నాలుగెకరాల్లో వరి వేశాడు. సాగు నీరు లేక, బావిలో నీరు ఎల్లక పంట ఎండి పోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ఏం చేయాలో తెలియడం లేదని ఆదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.