సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ ) : స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల పర్వం తీవ్ర వివాదస్పదంగా మారింది. పారదర్శకతకు పాతర వేస్తూ, ఉన్నతాధికారులు నడిపించిన ఈ బదిలీల వ్యవహారం ఇప్పుడు ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) నుంచి సచివాలయం వరకు హాట్ టాపిక్‌గా మారింది. అర్హులైన, అనారోగ్య సమస్యలతో ఉన్న ఇంజినీర్ల ఆప్షన్లను బుట్టదాఖలు చేస్తూ, తెరవెనుక ‘భాసరా లీలలు’ నడిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారికి ‘ముఖ్య’నేత సోదరుడికి సమీప బంధువు కావడంతో ఈ ఆంధ్ర అధికారి ఇంజినీర్ల బదిలీల్లో అడ్డగోలుగా అక్రమాలకు తెరలేపినట్లు చర్చ జరుగుతున్నది.
పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలో ఇటీవల భారీ ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ)ల బదిలీలు జరిగాయి. అయితే ఈ బదిలీల ప్రహసనంలో అత్యంత విచిత్రమైన, విస్తుపోయే అంశం ఒకటుంది. గతంలో తీవ్ర అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో సస్పెన్షన్‌కు గురైన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)కి కూడా ఈ బదిలీల లిస్టులో చోటు కల్పించారు. సదరు అధికారి కొత్త స్థానంలో జాయిన్ కావడానికి వెళ్లగా మీరు సస్పెన్షన్‌లో ఉన్నారు కదా.. ఎలా జాయిన్ అవుతారు? ఓ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దానికి ఆ సస్పెండెడ్ అధికారి ఏ మాత్రం బెదరకుండా ‘నేను సస్పెన్షన్‌లో లేను, లీవులో ఉన్నాను’ అని బుకాయించడం గమనార్హం. సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు పడిన విషయాన్ని గతంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా ఈఎన్సీకి లిఖిత పూర్వకంగా తెలియజేసినప్పటికీ.. ప్రభుత్వం వద్ద ఆ ఫైళ్లను దాచిపెట్టి మరీ బదిలీల లిస్టులో పేరు చేర్చడం వెనుక ఉన్న ‘మతలబు’ ఏంటనేది ఇప్పుడు ఆ శాఖలో మిస్టరీగా మారింది.
ప్రభుత్వం జారీ చేసిన బదిలీల మార్గదర్శకాల (జీవో 38కి) విరుద్ధంగా ఈ బదిలీలు జరిగాయని బాధితులు నెత్తినోరు బాధుకుంటున్నారు. 31.12.2025 నాటికి ఒకే పరిధిలో 4 ఏళ్లు నిండిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిబంధనలు ఉన్నా.. సీనియర్లను వదిలేసి ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఈల బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ లిస్టులో కేవలం నలుగురిని చూపించి, అందులో ఎవరిని కదల్చలేదని, అసలు ఆ లిస్టులోనే లేని ఒక ఎస్ఈని నిబంధనలకు విరుద్ధంగా కరీంనగర్ నుంచి వరంగల్‌కు బదిలీ చేయడం వెనుక పెద్ద హస్తమే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం ఉంది. ఇక ఈఈల లాంగ్ స్టాండింగ్ టాప్ లిస్టులో ఉన్న 15 మందిలో ఐదుగురిని అదే స్థానాల్లో కొనసాగించడం వెనుక అంతరార్థం ఏంటని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ ఈఈ (డీఈఈ)ల బదిలీల్లోనూ దీర్ఘ కాలికంగా ఉన్న వారిని కాదని ఇతరులను మార్చేయడం గమనార్హం.
నిజానికి బదిలీల ఆప్షన్లు, ఫైనల్ లిస్టును ఆన్లైన్లో పారదర్శకంగా ఉంచాల్సి ఉండగా.. ఈఎన్సీ కార్యాలయం ఆ నియమాన్ని తుంగలో తొకింది. కుటుంబ సభ్యుల అనారోగ్యం, పిల్లల చదువుల రీత్యా ఇంజినీర్లు ఇచ్చుకున్న 5 ఆప్షన్లను కనీసం పరిగణనలోకి తీసుకోలేదని బాధిత ఇంజినీర్లు వాపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు చెప్పారని లిస్టులో లేనివారికి పోస్టింగులు ఇవ్వగా.. ఎలాంటి రికమండేషన్లు లేని అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేశారని, పైగా బదిలీల ఆర్డర్ల కాపీ చేతికి రావాలంటే ఒకొకరు రూ. 30,000 ఇచ్చుకోవాలంటూ డిమాండ్ చేసినట్లు కార్యాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న శాఖలోనే ఇంతటి అక్రమాలు, పైరవీలు జరగడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, బదిలీల అక్రమాలకు చెక్ పెట్టి, నిబంధనల ప్రకారం పనిచేసే ఇంజినీర్లకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రధాన కార్యాలయంలోని నాలుగు, ఐదో అంతస్తుల్లో తిష్టవేసిన కొందరు అధికారులు తాము చెప్పిందే వేదంగా ఈ బదిలీల చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఐదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఇద్దరు కీలక అధికారులను గత (2024) బదిలీల్లోనూ, ప్రస్తుత బదిలీల్లోనూ కదల్చలేకపోయారు. ఆ ఇద్దరిలో ఒక అధికారి అయితే తాము ఉన్న స్థానం నుంచి మార్చవద్దంటూ ఏకంగా ముగ్గురు మంత్రుల నుండి సిఫార్సు లేఖలు తెచ్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు అధికారులు చెప్పిన వారికే ఈఈ, డీఈ, ఏఈల బదిలీల్లో ప్రాధాన్యత దకిందనే విమర్శలు వస్తున్నారు. కాగా కొత్తగా ఏర్పడిన సీఎంసీ, ఎంఎంసీలలో పనిచేస్తున్న కొందరికి అదే ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చి, మరికొందరిని మాత్రం లాంగ్ స్టాండింగ్ పేరిట బదిలీ చేశారు. కొందరిని బదిలీల పరిధి నుంచి తప్పించడానికి ప్రయత్నించగా, తీవ్ర వ్యతిరేకత రావడంతో హడావిడిగా మే 25న వారిని కౌన్సెలింగ్‌కు పిలిచారని, ఎక్కువగా సీఎంసీ పోస్టింగ్‌లకు అత్యధికంగా పైరవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ నుంచి ఎంత మంది ఇంజినీర్లను బదిలీ చేశారో..తిరిగి అంత మందిని ఇవ్వకుండా పెద్ద కార్పొరేషన్‌ను పక్కన పెట్టడం పై చర్చ జరుగుతున్నది.