Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం టూర్లో పాల్గొంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా టోర్నీలో ఆడే విషయంపై పునరాలోచిస్తామని పాక్ చెప్పడం ఏంటని ఇర్ఫాన్ మండిపడ్డారు.
వచ్చే వారంలోనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయితే, టోర్నీకి సమయం దగ్గరపడుతున్న సందర్భంలో పాక్ మెలికపెట్టింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకిస్తోంది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీలో పాల్గొనే విషయంపై ఆలోచిస్తామని చెప్పింది. ఈ అంశంలో తమ దేశ ప్రధాని నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. తుది నిర్ణయం ఈ నెల 30 లేదా వచ్చే నెల 2న చెప్తామని తెలిపింది. అంటే.. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే అంశంపై పాకిస్తాన్ ఇంకా తుది నిర్ణయం తెలపలేదు. అయితే, పాక్ ఇలా వ్యవహరించడంపై భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డారు. పాక్ నిర్ణయం అసంబద్ధమని, తెలివి తక్కువ తనమని వ్యాఖ్యానించారు.
‘‘శ్రీలంక వంటి తటస్థ వేదికలపై టోర్నీ ఆడేందుకు అంగీకారం తెలిపిన తర్వాత కూడా పాకిస్తాన్ ఇలా చేయడం బుద్ధి తక్కువ తనం. మాట ఇచ్చిన తర్వాత చివరి నిమిషంలో వెనక్కు తగ్గడం సరికాదు. ఇలాంటి గందరగోళ పరిస్థితిని పాక్ ఎందుకు సృష్టిస్తోంది’’ అని పఠాన్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇండియా-పాక్ మధ్య ఫిబ్రవరి 15న కొలంబోలో మ్యాచ్ జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ ఉన్న గ్రూప్ఏలో నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ ఉన్నాయి.