Ceasefire : ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇరాన్‌పై దాడి జరిగింది. ఇరాన్‌లోని లావాన్ ఐలాండ్‌లో ఉన్న చమురు క్షేత్రంపై బుధవారం మిస్సైల్ దాడి జరిగింది. ఈ దాడిలో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. శతృవులు తమపై దాడి చేశారని ఇరాన్ పేర్కొంది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ దాడి జరిగిందని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపింది. దాడి కారణంగా వెలువడ్డ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ఇక, ఈ దాడి చేసింది ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. లావాన్ ఐలాండ్, ఇరాన్‌కు చాలా కీలకం. పర్షియన్ గల్ఫ్ వద్ద ఉన్న ఈ దీవి 78 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడ భారీ స్థాయిలో క్రూడాయిల్‌ను ఇరాన్ నిల్వ చేస్తుంది. ఇక్కడ్నుంచి చమురును విదేశాలకు రవాణా కూడా చేస్తుంది. ఇలా ఇరాన్‌పై దాడులు జరుగుతుంటే, మరోపక్క ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. కువైట్, యూఏఈపై 31 మిస్సైల్స్‌తో దాడి చేసింది. ఈ దాడుల్ని తాము అడ్డుకున్నట్లు కువైట్, యూఏఈ తెలిపింది.
తమ దేశాల్లోని పవర్ ప్లాంట్లు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు కువైట్, యూఏఈ తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, లెబనాన్‌లోని హెజ్బొల్లా కేంద్రాలపై దాడుల్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్ని రష్యా ఖండించింది. ఈ వారంలో ఇరాన్-అమెరికా మధ్య జరిగే చర్చల అనంతరం యుద్ధాన్ని పూర్తిగా ఆపే విషయంలో స్పష్టత వస్తుంది.