వాషింగ్టన్ డీసీ, జనవరి 2: దిగజారిన ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఇరాన్‌లోని అనేక ప్రావిన్సులకు నిరసన ప్రదర్శనలు విస్తరించిన నేపథ్యంలో నిరసనకారులపై ఇరాన్ అధికారులు హింసాత్మక చర్యలకు పాల్పడితే గట్టిగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న వారిపై హింసకు పాల్పడిన పక్షంలో వారికి అండగా అమెరికా నిలబడుతుందని, ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఇరాన్లో ప్రజా నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఇరాన్‌లోని అనేక ప్రావిన్సుల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాల కాల్పుల్లో నిరసనకారులు మరణించినట్లు సీఎన్ఎన్ వార్తాసంస్థ వెల్లడించింది. పోలీసులతో ఘర్షణకు దిగిన నిరసనకారులు అధికారులపై రాళ్లు రువ్వి వాహనాలకు నిప్పు పెట్టినట్లు ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. కొందరు సాయుధ ఆందోళనకారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారని, పలువురు వ్యక్తుల నుంచి అధికారులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారని తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పౌరుల భద్రత సాకుతో తమ దేశ వ్యవహారాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే వారు అందుకు పశ్చాత్తాపం చెందే విధంగా సమాధానం ఇస్తామని ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సలహాదారు అలీ షాంఖానీ హెచ్చరించారు. తమ జోలికి వస్తే సహించబోమని చెప్పారు.