న్యూఢిల్లీ : ప్రతి ఒక్కరి జీవితంలోనూ చేదు జ్ఞాపకాలు ఉంటాయి. కొందరిని అవి జీవితాంతం వెంటాడుతూ అంతులేని క్షోభకు గురిచేస్తుంటాయి. అయితే ఈ చేదు జ్ఞాపకాలను మనసు నుంచి చేరిపేయొచ్చని, వాటి స్థానంలో మధుర జ్ఞాపకాలను పునరుద్ధరించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల బానిసలు తమను నాశనం చేస్తున్న డ్రగ్స్ జోలికి వెళ్లకుండా కూడా చేయవచ్చని పేర్కొంటున్నారు. అదే విధంగా అల్జీమర్స్ లేదా అమ్నీసియా వల్ల మరచిపోయిన జ్ఞాపకాలను కూడా పునరుద్ధరించవచ్చట. ప్రొఫెసర్ స్టీవ్ రమిరెజ్ రాసిన తాజా పుస్తకం ‘హౌ టు ఛేంజ్ ఏ మెమరీ’లో ఈ వివరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు స్కై-ఫై మూవీస్‌లోనే కనిపించిన సైన్స్‌ను స్టీవ్ వాస్తవ ప్రపంచంలో వివరించారు.
బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎలుకలపై చేసిన ప్రయోగాలతోపాటు, తన జీవితంలో తన మిత్రుడు క్సులియు మరణం వల్ల ఏర్పడిన పరిస్థితులపై స్టీవ్ బృందం పరిశోధన చేసింది. మానవుల జ్ఞాపకాలను తిరగ రాయడం ఆధునిక వైద్య రంగంలో సాధారణ భాగంగా మారే రోజులు వస్తాయని ఆయన చెప్పారు. కాంతి ద్వారా క్రియాశీలమైన మెదడు కణాలను ఉపయోగించి ఎలుకల్లో జ్ఞాపకాలను గుర్తించగలిగామని తెలిపారు. తన బృందం ఆ ఎలుకల మెదడులోకి తప్పుడు జ్ఞాపకాలను పంపించి, అంతకుముందు కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి తీసుకురాగలిగినట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, మానవుల్లో కూడా ఇది సాధ్యమవుతుందని తెలిపారు. శాశ్వతంగా కోల్పోయినట్లు భావించిన జ్ఞాపకాన్ని పరిశోధకులు విజయవంతంగా పునరుద్ధరించగలిగారన్నారు. జ్ఞాపకశక్తి గురించి మన ఆలోచనల పునాదులను ఈ ఫలితాలు కుదిపేస్తున్నట్లు తెలిపారు.
దేనినైనా గుర్తు చేసుకున్న ప్రతిసారీ దానిలో సూక్ష్మమైన మార్పులు కనిపిస్తాయన్నారు. అల్జీమర్స్, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో కోల్పోయిన జ్ఞాపకాలను పునరుద్ధరించడం చాలా గొప్ప ప్రయోజనమని తెలిపారు. స్టీవ్ ల్యాబ్ పార్టనర్ క్సు లియు అకాల మరణం ఆయనను తీవ్రంగా కలచివేసింది. కాల క్రమంలో జ్ఞాపకాలు మారుతుండటం గురించి ఆయనకు స్వయంగా ఉన్న అవగాహన ఈ కష్టకాలంలో సాయపడింది. తన మిత్రుని మరణానంతరం తనకు స్పృహతో కూడిన కలలు వచ్చేవన్నారు. తనలో ఆశావాదాన్ని నింపడానికి తన మెదడు చేసిన ప్రయత్నంగా ఈ కలలను భావిస్తున్నానని తెలిపారు. తాను రాసిన పుస్తకానికి హృదయం వంటి తన మిత్రుడిని గౌరవించడం, తామిద్దరి మధ్య ఉన్న జ్ఞాపకాలకు న్యాయం చేయడం తన లక్ష్యమని చెప్పారు.