న్యూఢిల్లీ: ఇరాన్‌లోని ఆరు మిలిటరీ విమానాశ్రయాలపై దాడి చేసి 15 విమానాలు, రన్‌వేలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాలలోని విమానాశ్రయాలపై తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) తెలిపాయి. తమ డ్రోన్ దాడులు ఎఫ్-15, ఎఫ్-5 ఫైటర్ జెట్లు, ఒక రీఫ్యూయెలింగ్ విమానం, ఒక హెచ్-1 కోబ్రా అటాక్ హెలికాప్టర్ని ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అయితే ఇరాన్ ఈ దాడులను ధ్రువీకరించలేదు.
ఎవిన్ జైలుపై వైమానిక దాడి
ఇరాన్‌లోని అత్యంత క్రూరమైన కారాగారంగా పేరుమోసిన ఎవిన్ జైలుపై సోమవారం ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. ఎవిన్ జైలుపై జరిగిన దాడికి ఇజ్రాయెల్ నేరుగా బాధ్యత తీసుకోనప్పటికీ ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై వరుస దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. సోమవారం మధ్యాహ్నం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఏఎఫ్‌పీ జర్నలిస్టులు వెల్లడించారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీకి నేరుగా జవాబుదారీగా వ్యవహరించే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ) ఎవిన్ కారాగారాన్ని నిర్వహిస్తున్నాయి. హక్కుల ఉల్లంఘనకు మారుపేరుగా పరిగణించే ఈ జైలుపై అమెరికా, యూరోపియన్ ఏనాడో ఆంక్షలు విధించాయి.
ఫోర్డోపై మళ్లీ దాడులు
ఇరాన్లో ముఖ్యమైన అణుశుద్ధి కేంద్రం ఫోర్డో సహా మూడు అణు కేంద్రాలపై ఆదివారం అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్డోపై ఇజ్రాయెల్ మరోసారి దాడులు జరిపినట్టు ఇరాన్ తెలిపింది. అయితే ఎంతమేరకు నష్టం వాటిల్లిందో వెల్లడించలేదు.
ఇజ్రాయెల్ విద్యుత్తు కేంద్రంపై దాడి
తమపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరిట తమ క్షిపణి, డ్రోన్ దాడుల ఉధృతిని తీవ్రతరం చేసింది. హైఫా, టెల్ అవీవ్తోసహా అనేక ఇజ్రాయెలీ నగరాలపై దాడులు నిర్వహించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని విద్యుత్తు కేంద్రంపై సోమవారం ఇరాన్ క్షిపణి జరిపిన దాడి కారణంగా విద్యుత్తు సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయి దాదాపు 8 వేల మంది ఇజ్రాయెలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సోమవారం ఇరాన్ దాడులు కొనసాగాయి. జెరూసలెంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి.