RBI | న్యూఢిల్లీ, నవంబర్ 4: వచ్చే ఏడాది తొలినాళ్లలో పదవీ విరమణ చేయబోతున్న రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైకేల్ దేవబ్రత పాత్రా స్థానంలో నూతన వ్యక్తిని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పదవికోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఆర్థికవేత్త అయివుండాలి. ఎంపికైన వ్యక్తి..పరపతి సమీక్ష డిపార్ట్మెంట్, పరపతి సమీక్ష కమిటీలో సభ్యుడిగా కొనసాగనున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కనీసంగా 25 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న వచ్చే ఏడాది జనవరి 15 నాటికి 60 ఏండ్లకు పైబడిన వారు అర్హులు. ఎంపికైన వ్యక్తిగా నెలకు రూ.2.25 లక్షల చొప్పున వేతనం చెల్లించనున్నది. ఈ పోస్ట్‌కు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.
మారుతి ఉత్పత్తిలో కోత
న్యూఢిల్లీ, నవంబర్ 4: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ క్రమంగా ఉత్పత్తిని తగ్గించుకుంటున్నది. ప్రస్తుత పండుగ సీజన్లో కార్లకు డిమాండ్ పడిపోవడంతో గత నెలలో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిని 16 శాతం తగ్గించుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో యుటిలిటీ వాహన ఉత్పత్తి మాత్రం గతేడాదితోపోలిస్తే 33 శాతం పెంచుకున్నది. ఈ విషయాన్ని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. గత నెలలో కేవలం 89,174 యూనిట్ల ప్యాసింజర్ కార్లు ఉత్పత్తి చేయగా, 72,339 యుటిలిటీ వాహనాలను ఉత్పత్తి చేసింది. మొత్తంగా గత నెలలో 1,77,312 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది.