మన శరీరంలోని మలినాలు శుభ్రం చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని ఫిల్టర్లు అంటారు. కిడ్నీల పనితీరు బాగున్నప్పుడే శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. కిడ్నీల పనితీరు దెబ్బతింటే శరీరంలోని మలినాలు పేరుకుపోతాయి. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
శరీరంలో అధికమైన లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాల కలయికతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. చాలావరకు ఇవి చిన్న సైజులోనే ఉంటాయి. కానీ యూరిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలను ఎక్కువ శోషించుకోవడం వల్ల వాటి పరిమాణం పెరిగిపోతుంటుంది. ఈ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు ప్రయాణించగలవు. ఈ రాళ్లు మూత్రాశయంలోకి ప్రవేశించిన తర్వాత జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటివి తలెత్తుతాయి. ముఖ్యంగా బొడ్డు, వీపు భాగంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది.
– మూత్ర విసర్జన చేసేప్పుడు కష్టంగా, లేదా నొప్పిగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు, యూటీఐకి ప్రారంభ సంకేతం.
– మూత్రం రంగు మారడం, రక్తం రావడం జరిగితే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.
– తరచూ మూత్రం రావడం.. కొద్ది కొద్దిగా మూత్ర విసర్జన చేయడం
– కిడ్నీలో రాళ్లు ఉంటే బొడ్డు, వీపు ప్రాంతంలో తరచుగా నొప్పి వస్తుంటుంది.
– జ్వరం, చలి, వికారం, వాంతులు కూడా లక్షణాలే
బచ్చలికూరలో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఆక్సలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోతుంది. కాబట్టి కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేవు. దీనివల్ల అవి శరీరంలోనే నిల్వ ఉండి చక్కటి రాళ్లుగా తయారవుతాయి.
బచ్చలికూరతో పాటు బీట్రూట్, కందగడ్డ, టీ, చాక్లెట్ వంటి వాటిల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే.. తప్పనిసరిగా ఆక్సలేట్ ఆహారానికి దూరంగా ఉండాలి. లేదా తక్కువగా తినాలి.
పాలు, పాల ఉత్పత్తులు, రెడ్ మీట్, చేపలు, గుడ్లు వంటి ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఈ ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.
ఉప్పులో సోడియం ఉంటుంది. ఈ సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం ఏర్పడుతుంది. ఇది ఎక్కువైతే కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేవు. కాబట్టి ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
ప్యాక్ చేసిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్లో ఎక్కువ మోతాదులో ఫాస్పరస్, సోడియం ఉంటుంది. కిడ్నీ వ్యాధుల బారిన పడ్డవారు ప్యాక్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి.
శీతల పానీయాల్లో ఫాస్పేట్ అనే రసాయనం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. అందువల్ల కూల్‌డ్రింక్స్ అధికంగా తాగవద్దు. ఉప్పు మాత్రమే కాకుండా అధిక చక్కెర, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లు కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి.
వెల్లుల్లిని మూత్రపిండాల రక్షణకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్లాటింగ్ కణాలు ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
బెర్రీస్ వివిధ రంగుల్లో లభ్యమవుతాయి. వాటిలో బ్లాక్‌బెర్రీ మినహా మిగతా అన్ని రకాల బెర్రీలు కిడ్నీలకు మేలు చేసేవే. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ న్యూట్రియంట్స్, యాంటీఇన్‌ప్లమేటరి క్వాలిటీస్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వ్యాధి నిరోధకతను పెంచి బ్లాడర్ ఫంక్షన్స్ సక్రమంగా ఉండేందుకు దోహదపడుతాయ.
శనగలు, పెసర్లు లాంటి ధాన్యాలను తరచూ మొలకెత్తించి తినడంవల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్ శరీరంలోని మలినాలను తనతో కలుపుకుని విసర్జితమవుతుంది. అందువల్ల మూత్రపిండాలు శుభ్రపడి కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
క్యాబేజీ మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సాధారణంగా క్యాబేజీని కిడ్నీల డ్యామేజ్‌ను అరికట్టే సహజ ఔషధంగా వినియోగిస్తారు.
ఉల్లిపాయలు కిడ్నీల్లో రాళ్లను తొలగించడానికి తోడ్పడుతాయి. అంతేగాక, మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.