బూర్గంపహాడ్, జూలై 01 : పారిశ్రామికవాడగా పేరున్న సారపాక మేజర్ పంచాయతీలో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షానికే తటాకాలను తలపిస్తున్నాయి. సారపాక-ఇరవెండి ప్రధాన రహదారి దెబ్బతినడంతో గోతులు ఏర్పడి చిన్నపాటి వర్షాలకే గోతుల్లో వరదనీరు చేరి బురదమయంగా మారి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మసీద్ రోడ్, తాళ్లగొమ్మూరు పంచాయతీలో ప్రధాన రహదారి వైపు రోడ్లు గోతులు పడి నీరు నిల్వడంతో బురదమయంగా మారాయి. అంతర్గత రహదారుల్లో ఉన్న గోతులను తాత్కాలికంగా పూడ్చుతుండటంతో వర్షం పడితే చాలు వరదనీరు నిలిచి ఆ ప్రాంతమంతా తటాకాన్ని తలపించడంతో పాటు అటుగా ప్రయాణించాలంటే వాహనదారులకు నరకప్రాయంగా మారింది. శాశ్వత పరిష్కార మార్గాలు చూడకపోవడంతో అంతర్గత రహదారులు, ప్రధాన రహదారి గోతులతో దర్శనమిస్తూ ఇలా వర్షాకాలంలో వాహనదారులు, పాదచారులకు ఈ రోడ్లపై నడవాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి గోతులు పడిన అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టి నీరు నిల్వకుండా చూడాలని పారిశ్రామికవాడ ప్రజలు కోరుతున్నారు.

పారిశ్రామికవాడలో తటాకాన్ని తలపిస్తున్న అంతర్గత రహదారులు