Tini Tom | ‘దృశ్యం’ సినిమా ఫేమ్ నటి అన్సిబా హసన్ దాఖలు చేసిన ఒక ఫిర్యాదుపై నటుడు టిని టామ్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని ఎర్నాకుళం ట్రయల్ కోర్టు కడవంత్ర పోలీసులను ఆదేశించింది. ఇటీవల అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) కార్యాలయంలో జరిగిన చర్చల సందర్భంగా టిని టామ్ తనను ‘జిహాదీ’ అని పిలిచారని, అలాగే ‘డబుల్ డాడీ సిండ్రోమ్’, ‘డీఎన్ఏ ఇష్యూ’ వంటి అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారని అన్సిబా ఆరోపించారు.
ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో, అన్సిబా హసన్ న్యాయం కోసం ఎర్నాకుళం జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను నేడు విచారించిన జడ్జి కావ్య సోమన్.. నటుడిపై వచ్చిన ఆరోపణలు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్లు 74, 75(iv), 79, 299, 302 (మహిళల గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపులు, మతపరమైన భావాలను దెబ్బతీయడం)తో పాటు కేరళ పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ 119(ఎ) కిందకు వస్తాయని పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం నిందితుడిపై కాగ్నిజబుల్ (పోలీసులు నేరుగా జోక్యం చేసుకోదగిన) నేరం జరిగినట్లు స్పష్టమవుతోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు స్పష్టం చేసింది. నేరపూరిత ఉద్దేశం ఉందా లేదా అనేది పూర్తి ఆధారాల సేకరణ తర్వాతే తెలుస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడింది.
ఇక ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నీనా కురుప్ స్టేట్మెంట్ను కూడా కోర్టు పరిశీలించింది. కొచ్చిలోని ‘అమ్మ’ కార్యాలయంలో అన్సిబాపై టిని టామ్ ఈ వ్యాఖ్యలు చేశారని, ఆ సమయంలో మాజీ ప్రెసిడెంట్, నటి శ్వేతా మీనన్ కూడా అక్కడే ఉన్నారని నీనా పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు శ్వేతా మీనన్‌ను విచారించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. టిని టామ్ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారని, ఇందులో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని పోలీసులు ఇచ్చిన నివేదికను కోర్టు తోసిపుచ్చింది. వివరణాత్మక దర్యాప్తు తర్వాతే తుది నిర్ణయానికి రాగలమని పేర్కొంది. అలాగే, పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన అభ్యంతరాలను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అన్సిబా హసన్ తరఫున అడ్వకేట్లు ముహమ్మద్ ఫిరదౌస్ ఎవి, లిబిన్ వర్గీస్ వాదనలు వినిపించారు.