హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం నవ చరితకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. సీఎం కేసీఆర్ కృషి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజది. దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ఎనిమిదేండ్ల కిందట ఇదే రోజు చరిత్ర సృష్టించాం. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రజా ఉద్యమం ఫలితంగా 18-02-2014న లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాస్ అయ్యింది’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. నాడు బిల్లు పాసైన తర్వాత జరిగిన సంబురాల ఫొటోను ట్వీట్‌కు జత చేశారు.