హైదరాబాద్,అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు.. సర్కారు బడుల టీచర్ల సేవలను వినియోగించుకొంటున్నది. పలువురు ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం), టీచర్లకు పరీక్షల విధులను కేటాయించింది. పలువురిని చీఫ్ సూపరింటెండెంట్లుగా, డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించింది. ఈ మేరకు ఆయా హెచ్ఎంలు, టీచర్లకు ఇంటర్‌బోర్డు అధికారులు సమాచారం అందించారు. ఇంటర్ సెకండియర్లోని విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఫస్టియర్ పరీక్షలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించనుండటంతో ఈ ఏడాది 1,770కిపైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ విద్యలో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల సంఖ్యకు మించి పరీక్ష కేంద్రాలు ఉండటంతో స్కూల్ టీచర్ల సేవలను వినియోగించుకోనున్నారు. 150 ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు.
ముగిసిన దసరా సెలవులు
విద్యాసంస్థలకు బతుకమ్మ, దసరా సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలన్నీ సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థుల రాకతో పాఠశాలలు మళ్లీ కళకళలాడనున్నాయి.