- గృహాల జాబితా నమోదుపై ఎన్యుమరేటర్లకు అవగాహన
జూలూరుపాడు, మే 05 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘జన గణన-2027’ప్రక్రియలో భాగంగా జూలూరుపాడు మండలంలో సన్నాహక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి దశలో భాగంగా నిర్వహించాల్సిన ‘ఇంటి జాబితా, గృహాల గణన’ పై రెండో బ్యాచ్ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఈ నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఎన్యుమరేటర్లకు క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. శిక్షణలో భాగంగా అధికారులు మరియు సిబ్బంది స్థానిక సొసైటీ ప్రాంతం నుండి లైబ్రరీ సమీపం వరకు పర్యటించారు. గృహాల గణనలో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన ‘HLO యాప్’ పనితీరును సిబ్బంది ప్రత్యక్షంగా పరిశీలించారు.
ప్రతి ఇంటి వివరాలను యాప్లో తప్పులు లేకుండా ఎలా నమోదు చేయాలి, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు ఎలా అధిగమించాలి అనే అంశాలపై సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లకు మార్గనిర్దేశం చేశారు. వచ్చే జన గణన సమయానికి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే ఈ ముందస్తు క్షేత్రస్థాయి శిక్షణ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జూలూరుపాడులో ముమ్మరంగా జన గణన క్షేత్రస్థాయి శిక్షణ