దండేపల్లి : రైతులు వరి (Paddy) బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని, దీనివల్ల భూ సాంద్రత పెరిగి ఉత్పత్తులు పెరుగుతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ( Collector Kumar Deepak ) పేర్కొన్నారు. దండేపల్లి మండలంలోని నాగసముద్రం, మాకులపేట గ్రామాలను కలెక్టర్ గురువారం సందర్శించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంటమార్పిడి చేయాలని సూచించారు.
నీటిపారుదల వసతులు, గిట్టుబాటు ధరల గురించి ఆరా తీశారు. కడెం ప్రాజెక్టుకు ( Kadem Project) కెనాల్ చివరి ఆయకట్టుదారులకు నీరందక పంటపొలాలు ఎండిపోతున్నాయని రైతులు కలెక్టర్కు విన్నవించారు. చివరి తడి వరకు సక్రమంగా కెనాలు నీరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు కూడా నీటిని సద్వినియోగపరచుకోవాలని కోరారు.
నీటి వసతి లేని ప్రాంతాల రైతులు నీరు ఎక్కువగా అవసరం అయ్యే పంటల బదులు తక్కువ నీరు అవసరం పడే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట మండలానికి చెందిన అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ విజయ , వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ కన్య , ఆర్ఐ భూమన్న తదితరులు పాల్గొన్నారు.