న్యూఢిల్లీ : అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) మోడల్స్‌ను భూమిపై నిర్వహించడం మోయలేని భారంగా మారుతుండటంతో గూగుల్, ఎన్విడియా, అమెజాన్, స్పేస్ఎక్స్ వంటి బిగ్ టెక్ కంపెనీలు అంతరిక్షంవైపు చూస్తున్నాయి. విద్యుత్తు ఖర్చులు ఆకాశాన్ని తాకుతుండటం, అత్యధిక పనితీరును ప్రదర్శించే జీపీయూలు విడుదల చేసే ఉష్ణాన్ని కూలింగ్ సిస్టమ్స్ తట్టుకోలేకపోతుండటం వల్ల ఏఐ కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కక్ష్యలోకి తరలిస్తే బాగుంటుందని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ఏఐ డాటా సెంటర్లకు విపరీతమైన విద్యుత్తు అవసరమవుతుంది. ఉపగ్రహాలు సౌరశక్తిపై పని చేస్తాయి. ఫలితంగా నిర్వహణ వ్యయాలు పెద్ద ఎత్తున తగ్గుతాయి. ఏఐ సర్వర్లు అత్యధిక స్థాయిలో ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కూలింగ్ సిస్టమ్స్ చాలా ఖరీదైనవి, వనరులపై పెను భారం మోపేవి. అదే అంతరిక్షంలో అయితే, శూన్యం, నిరంతర రేడియోధార్మిక వాతావరణం వల్ల ఉష్ణం చల్లబడే ప్రక్రియ కోసం సంప్రదాయ మౌలిక సదుపాయాలు అక్కర్లేదు. ఇవన్నీ కలిసి కక్ష్యవైపు చూసేలా టెక్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నాయి.
సౌరశక్తి ఆధారిత ఉపగ్రహాల సమాహారాన్ని ఏర్పాటు చేయడంపై గూగుల్ దృష్టి పెట్టింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, భూమిపైగల పవర్ గ్రిడ్స్ లేదా కూలింగ్ సిస్టమ్స్‌పై ఆధారపడకుండా కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రాజెక్ట్ సన్కేచర్ ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతానికి ఇది ఆలోచనల దశలో ఉందన్నారు.
ఎన్విడియాలో భాగమైన స్టార్టప్ కంపెనీ స్టార్‌క్లౌడ్ పూర్తిగా సౌరశక్తితో పని చేసే ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నది. భూమిపై వనరుల పరిమితులను అధిగమిస్తూ, విస్తృతంగా ప్రాసెసింగ్ చేయగలిగే ఆర్బిటాల్ ఏఐ సూపర్‌కంప్యూటర్‌ను సృష్టించాలన్నదే స్పష్టమైన లక్ష్యం. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాటల్లో చెప్పాలంటే, రానున్న ఒకటి లేదా రెండు దశాబ్దాల్లో స్పేస్ బేస్డ్ ఏఐ కంప్యూట్ క్లస్టర్లు సాధారణ విషయంగా మారుతాయి. స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ, స్టార్‌లింక్ వీ3 శాటిలైట్స్‌ను ఆర్బిటాల్ ఏఐ కంప్యూట్ యూనిట్స్‌గా స్పేస్ఎక్స్ మార్చవచ్చునని చెప్పారు.