శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లపై మోదీ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. 10 ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో, ముసాయిదా నిబంధనలను రీ-నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
న్యూఢిల్లీ: కొత్త లేబర్కోడ్స్పై ట్రేడ్ యూనియ న్లు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన నేప థ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్లను కేంద్ర కార్మికశాఖ శుక్రవారం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు పార్లమెంటు 2019, 2020 లలో ఆమోదం తెలిపింది. 29 కార్మిక చట్టాలకు బదులుగా వీటిని తీసుకొచ్చారు. కానీ తుది నిబంధనలను అప్పట్లో ప్రకటించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ట్రేడ్ యూనియన్లు తాజా నోటిఫికేషన్లపై నిరసన తెలిపిన నేపథ్యంలో కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ స్పందించింది.
ఈ కోడ్స్‌కు నోటిఫికేషన్ 2020లో విడుదలైన తర్వాత, ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగాయి కాబట్టి, వీటిని మళ్లీ నోటిఫై చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖకు తెలిపింది. కొత్తగా వచ్చే సలహాలు, సూచనలను ఈ కోడ్స్‌లో చేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సలహాలు, సూచనలు ఇవ్వడానికి 45 రోజుల గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత 45 రోజుల్లో తుది రూపం ఇచ్చి, అమల్లోకి తీసుకొస్తారు. ఇదిలావుండగా, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఐదేళ్లలో తమ సొంత నిబంధనలను ప్రకటించాయి. ఆ ముసాయిదా నిబంధనలను తిరిగి నోటిఫై చేయడంపై నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు.