న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలని గతంలో వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ దృష్టి పెట్టింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే సంస్థగా విలీనం చేయడం గురించి పరిశీలిస్తున్నది. నిర్వహణ సామర్థ్యాన్ని, విస్తృతిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కసరత్తు జరుగుతున్నదని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూడు కంపెనీల ఆర్థిక స్థితిని స్థిరపరచడానికి కేంద్ర ప్రభుత్వం 2019-20, 2021-22 మధ్య కాలంలో రూ.17,450 కోట్లు సహాయం అందించింది. ఈ మూడు కంపెనీలను విలీనం చేయాలనే ప్రతిపాదన 2018-19 బడ్జెట్లో వచ్చింది.
కానీ 2020 జూలైలో రూ.12,450 కోట్లు మూలధన సాయం అందించి, ఈ ప్రతిపాదనను ఉపేక్షించారు. ఈ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో, విలీనం గురించి మళ్లీ ఆలోచిస్తున్నారు. మరోవైపు ఒక కంపెనీని ప్రైవేటీకరించడం గురించి కూడా పరిశీలిస్తున్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ఓ బిల్లును డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్నది. జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) అమెండ్మెంట్ యాక్ట్‌కు 2021 ఆగస్టులో ఆమోదం లభించింది. బీమా కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వానికి కనీసం 51 శాతం వాటా ఉండాలన్న నిబంధనను ఈ చట్టం తొలగించింది.