న్యూఢిల్లీ, నవంబర్ 23 : చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. దీంతో పంజాబ్, హర్యానా రాష్ర్టాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ పరోక్షంగా కేంద్రం చేతిలోకి వెళ్లిపోతుంది. లోక్‌సభ, రాజ్యసభ బులెటిన్లు కూడా సవరణ విషయాన్ని చూపడంతో వివాదం ప్రారంభమైంది. ఈ అధికరణ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతాలకు నిబంధనలు రూపొందించడానికి, వాటి కోసం నేరుగా చట్టాలు చేయడానికి రాష్ట్రపతికి అధికారం లభిస్తుంది. బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై పంజాబ్‌లోని అధికార, విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన స్వతంత్ర నిర్వాహకుడికి తలుపులు తెరిచినట్టేనని వ్యాఖ్యానించాయి.
దీనిపై కేంద్రం స్పందిస్తూ చండీగఢ్ చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన మాత్రమే తమ వద్ద ఉందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. దీనిపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అందరు నేతలతో చర్చించిన తర్వాతే దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటామని, చండీగఢ్ ఆశలను పరిగణనలోకి తీసుకుంటామని హోం శాఖ స్పష్టం చేసింది. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే యోచన తమకు లేదని పేర్కొంది.
ఇది రా్రష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా క్రూరమైన కుట్ర అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. చండీగఢ్‌ను రాష్ట్రం నుంచి లాక్కోవడానికి చేసే ఏ ప్రయత్నం, కుట్రను సాగనివ్వబోమని స్పష్టంచేశారు. ఇది పంజాబ్ హక్కులపై దౌర్జన్యమేనని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇది పంజాబ్ అస్థిత్వం, రాజ్యాంగ హక్కులపై నేరుగా దాడి చేయడమేనని అన్నారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చండీగఢ్‌పై పంజాబ్‌కు ఉన్న హక్కులు హరించుకుపోతాయని అన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఆర్టికల్ 240 ప్రకారం రాష్ట్రపతికి సంక్రమిస్తాయి. ఇప్పుడు అదే 240 అధికరణం పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకువస్తే పంజాబ్ ప్రభుత్వానికి చండీగఢ్‌పై ఎలాంటి పట్టు ఉండదు. ఆర్టికల్ 240 పరిధిలోకి తేవాలంటే ఆర్టికల్ 131ను సవరిస్తూ బిల్లు తేవాలి. వచ్చే శీతాకాల సమావేశాల్లో కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నది. చట్టసభలు లేని అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా, నాగర్ హవేలి, డామన్, డయ్యు, పుదుచ్చేరి ప్రస్తుతం అధికరణం 240 పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు చండీగఢ్ కూడా దీని పరిధిలోకి వస్తే ఇతర యూటీల మాదిరిగానే అది కూడా మారిపోతుంది.