ములుగు, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ములుగు మత్స్యశాఖ కార్యాలయంలో వాటాల పంచాయతీపై జరిగిన విచారణలో తీగ లాగితే డొంక కదులుతోంది. ఎఫ్‌ఎఫ్‌వో అక్రమాలపై విస్తుపోయే నిజాలు బయటపడినట్లు మత్య్స సహకార సంఘాల సభ్యులు తెలిపారు. మత్స్యశాఖ కార్యాల యంలో ఈ నెల 24వ తేదీన డీఎఫ్‌వోతో ఎఫ్ఎఫ్వోకు మేడారం జాతరలో పనిచేసిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీపై గొడవ జరిగింది. దీంతో డీఎఫ్‌వో 25వ తేదీన రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్‌కు లేఖ రాస్తూ ఎఫ్‌ఎఫ్‌వో వ్యవహరించిన తీరుతో పాటు ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన ఈ నెల 27వ తేదీన విచారణ అధికారిగా హైదరాబాద్ జిల్లా డీఎఫ్‌వో వీ రజినిని నియమించగా, ఆమె బుధవారం ములుగు కార్యాలయానికి చేరుకొని గతంలో డీఎఫ్‌వోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అధికారితో పాటు ఇన్చార్జి డీఎఫ్‌వో భాస్కర్ సమక్షంలో మల్కాజ్గిరి జిల్లాకు బ దిలీ అయిన ఎఫ్‌ఎఫ్‌వో రమేశ్‌ను విచారించారు.
ఇం దులో భాగంగా 2020, 2022, 2024 మేడారం జాతరలో ఎఫ్‌ఎఫ్‌వో గజ ఈతగాళ్లకు సగం డబ్బులే చె ల్లించి వారి వద్ద సంతకాలు తీసుకున్నట్లు తేలింది. అదేవిధంగా ప్రదొ వానకాలంలో మత్స్య సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలు సరఫరా అయిన సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు బయటపడింది. లెక్కప్రకారం చేప పిల్లలను చెరువులు, కుంటలలో వదలాల్సి ఉండగా ఎఫ్‌ఎఫ్‌వో రమేశ్ చేప పిల్లలను వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్‌తో ములాఖత్ అయ్యి ఒక్కో లారీకి రూ. 10వేల చొప్పున ముడుపులు తీసుకొని నాసిరకం పంపిణీ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లాకు చెందిన పలువురు మత్స్య సహకార సంఘ సభ్యులు ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా విచారణ అధికారి దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
ములుగు జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్(ఎఫ్‌ఎఫ్‌వో)గా కాంట్రాక్టు ఉద్యో గిగా పాముల రమేశ్ విధులు నిర్వహిస్తున్నాడు. 2025 డిసెంబర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌నంటూ కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు, ఎన్నికల అధికారులను బురిడీ కొట్టించి ప్రిసైడింగ్ అధికారిగా ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పీవో, ఏపీవోలుగా ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులుగా పనిచేసే అధికారులు మాత్రమే ఎన్నికల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే 2025 డిసెంబర్ 3వ తేదీన గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ రమేశ్‌ను ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ ఎన్నికల విధులు కేటాయించారు. డిసెంబర్ 14వ తేదిన జరిగిన ఎన్నికల్లో ఆయన వెంకటాపూర్ మండలంలోని ఓ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వర్తించిన విషయాన్ని సైతం విచారణ అధికారి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇంత జరిగిని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.