ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 16 : కుర్రో కుర్రో బెజవాడ కనకదుర్గమ్మ పలుకు.. సమ్మక్క సారక్క పలుకు.. శ్రీశైలం మల్లన్న పలుకు.. కొరివి వీరన్న పలుకు.. జరిగింది చెప్తాను.. జరగబోయేది చెప్తాను.. జరుగుతున్నది చెప్తాను.. కుర్రు కొండ దేవత కుర్రు రామన్న, లచ్చుమన్న చల్లంగా సూత్తూర్ కుర్రో కుర్రో అంటూ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జడ్పీహెచ్ఎస్ గోరంట్ల పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ సోమవారం మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం తీర్దాల గ్రామంలో జరిగే సంగమేశ్వర స్వామి జాతరలో కొయ్యదొర వేషధారణలో మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని, యువత వాటికి దూరంగా ఉండి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రణాళిక బద్ధంగా కష్టపడి లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ కరపత్రాలు భక్తులకు పంచుతూ ఫ్లెక్సీలు, మైక్ సెట్ ద్వారా డ్రగ్స్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అలాగే మరుగున పడుతున్న జానపద కళలను కూడా కాపాడడం తన వంతు కర్తవ్యం భావిస్తున్నట్లు తెలిపారు.

డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రతపై కోయదొరగా ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం