చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 22 : మాజీ హోం మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి 22వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చిట్టంపల్లి గేట్ సమీపంలోని ఇంద్రారెడ్డి విగ్రహానికి మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్‌రెడ్డితో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కాగా, ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని సోమాజిగూడలోని ఏఐజీ దవాఖాన సౌజన్యంతో కౌకుంట్ల గ్రామంలో వారం రోజులుగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రజల ముద్దు బిడ్డగా.. బడుగు బలహీన వర్గాలకు బాసటగా.. నిస్సహాయులకు నీడగా, పేద ప్రజలకు అండగా నిలిచిన ఇంద్రారెడ్డి తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించారన్నారు.
ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్, డీసీఎంఎస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సర్పంచ్‌లు గాయత్రి, సులోచన, శేరి శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.