హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): దొడ్డిదారిన పదవి తెచ్చుకొన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గురించి మాట్లేడే అర్హతలేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన చౌహాన్ నీతులు చెప్పడమేమిటని విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భయం అనేది కేసీఆర్ డిక్షనరీలోనే లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడరని చెప్పారు. రైతులను చంపిన ఘనత, ఎదిరించేవారిపై దాడులు నిర్వహించే సంస్కృతి ఉన్న బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వానికి నీతులు చెప్తున్నారని ఆగ్రహించారు. అభివృద్ధిలో మధ్యప్రదేశ్ స్థానం ఎక్కడని ప్రశ్నించారు. తలసరి ఆదాయంతోపాటు ఇతర రంగాల్లో అట్టడుగున ఉన్న మధ్యప్రదేశ్‌కు తెలంగాణతో పోలికే లేదని స్పష్టంచేశారు. నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్ ధరలపై బీజేపీ నేతలు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని నిలదీశారు. సీఎం కేసీఆర్ బయట తిరగడంలేదని విమర్శిస్తున్న బీజేపీ నేతలు.. తమ నేత ప్రధాని మోదీ ఎన్నికలప్పుడు మినహా మిగిలిన సమయాల్లో బయటకు రావడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజలకు ఏమి చేయాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ అయితే కార్పొరేట్ బాబుల జపం చేసే నైజం ప్రధానమంత్రి మోదీదేనని పేర్కొన్నారు.