– గుర్రంపోడు మండలం కాల్వపల్లి పంచాయతీలో బాధితుల ఆవేదన
గుర్రంపోడు, మార్చి 30 : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని కాల్వపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో రాజకీయ జోక్యం కలకలం రేపుతోంది. అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన బిల్లులను కావాలనే అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాల్వపల్లి గ్రామానికి చెందిన ఆదిరాల రాధా భర్త శ్రీరాములుకు ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో వారు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించి పునాది (బేస్మెంట్) స్థాయి వరకు పూర్తి చేశారు. గ్రామ స్థాయిలో కొందరు వ్యక్తులు రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి వారికి రావాల్సిన బిల్లులను నిలిపివేసినట్లు సమాచారం. ఈ అన్యాయంపై సోమవారం కాల్వపల్లి మూడవ వార్డు మెంబర్ రాంబాబు, ఐదవ వార్డు మెంబర్ షేక్ అక్బర్, మాజీ ఉప సర్పంచ్ ఆదిరాల శ్రీరాములు ఆధ్వర్యంలో గ్రామ యువకులు ఎంపీడీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు.
దీనిపై స్పందించిన ఎంపీడీఓ సంబంధిత ఇంటికి మండల స్థాయిలో అనుమతులు లభించాయని, ఎక్కడ కూడా సాంకేతిక అడ్డంకులు లేవని పేర్కొన్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో బిల్లులు రాకపోవడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు బచ్చనబోయిన సత్తయ్య, పిడిగం మహేశ్, మేకల ఆంజనేయులు, బొడ్డుపల్లి అనీల్ మాట్లాడుతూ.. కేవలం రాజకీయ కారణాలతో అర్హులైన పేదలకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. భవిష్యత్లో కూడా రాజకీయ పలుకుబడితో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయవద్దని, కేవలం నిరుపేదలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీఓ కి వినతి పత్రం అందజేశారు. రాధా-శ్రీరాములు కుటుంబానికి వెంటనే బిల్లులు విడుదల చేసి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.