న్యూఢిల్లీ, అక్టోబర్ 5 : విమాన టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఇంధన సర్చార్జిలను పెంచుతూ దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో తీసుకున్న నిర్ణయంతో విమాన టికెట్ ధరలు పెరిగాయి. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా విమాన చార్జీలు రూ.100 నుంచి రూ.350 వరకు పెరుగనున్నాయి. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించేవారిపై కూడా మరింత భారం పడనున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గడిచిన నెల రోజుల్లో ఇంధన ధరలు 14 శాతం వరకు పెరిగాయని, దీంతో సంస్థపై పడుతున ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా సర్చార్జిని పెంచినట్టు పేర్కొంది.
ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు సర్చార్జిని పెంచడం ఇది రెండోసారి. 500 కిలోమీటర్ల దూరం వరకు ఫ్యూయల్ సర్చార్జిని రూ.375గా వసూలు చేయనుండగా, 501 నుంచి 1,000 కిలోమీటర్ల వరకు రూ.600, 1001-1,500 కిలోమీటర్ల వరకు రూ.900, 1,500-2 వేల కిలోమీటర్ల వరకు రూ.1,150 చొప్పున వసూలు చేయనున్నది. అలాగే 2 వేల కిలోమీటర్ల పైగా ప్రయాణంపై రూ.1,300 ఫ్యూయల్ సర్చార్జిని విధిస్తున్నది. భారత్ నుంచి సార్క్ దేశాల మధ్య నడిచే విమాన సర్వీసుల్లో ఫ్యూయల్ సర్చార్జిని రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు, ఆఫ్రికా దేశాలకు రూ.6 వేల చొప్పున, యూరప్ సర్వీసులకు రూ.10 వేల చొప్పున వసూలు చేయనున్నది.