IndiGo | నిర్వహణపరమైన లోపాల వల్ల దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో (IndiGo) విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోన్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది (IndiGo Flight Cancellations). అయితే దీని ప్రభావం భారతీయ చిత్ర పరిశ్రమపై పడినట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌తో పాటు పలు చిత్ర పరిశ్రమలు నుంచి నటులు షూటింగ్‌ల కోసం ఇతర నగరాలకు వెళ్లల్సి ఉండగా.. విమానాలు రద్దు కావడంతో షూటింగ్‌లు మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలుస్తుంది.
ఫిలిం నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కాంబినేషన్ డేట్స్‌ను ముందుగానే ప్లాన్ చేసుకున్న నిర్మాతలు, ఇండిగో విమానాల రద్దుతో షాక్ తిన్నట్లు తెలుస్తుంది. అలాగే ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న ప్రధాన ఆర్టిస్టులు తమ షెడ్యూల్స్ ప్రకారం హైదరాబాద్ చేరుకోలేకపోయినట్లు సమాచారం. ఇండిగో విమానాల్లో నెలకొన్న సాంకేతిక, సిబ్బంది సమస్యలు కేవలం ప్రయాణీకులకే కాకుండా, భారీ బడ్జెట్‌తో నడుస్తున్న టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆర్థిక వ్యవహారాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ సమస్య సద్దుమణగడానికి మరో రెండు రోజులు అయిన పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.