Breakfast | రోజూ అందరూ వివిధ రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తుంటారు. తమకు అందుబాటులో ఉండే ఆహారాలను వారు తింటుంటారు. ఇడ్లీ, దోశ, పూరీ వంటి సంప్రదాయ ఆహారాలతోపాటు కొందరు పోషకాలు కలిగిన భిన్న రకాల ఆహారాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తింటారు. అయితే కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తుంటారు. ఏకంగా మధ్యాహ్నం లంచ్ చేస్తారు. ఉదయం సమయం లేదని లేదా కావాలనే కొందరు బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని, మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా కీడు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అంటున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే దీర్ఘకాలంలో మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు అంటున్నారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల దీర్ఘకాలంలో లో షుగర్ సమస్య ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అప్పటికే ఆ సమస్య ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తే ఇంకా తీవ్ర ప్రభావం ఉంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ మరింత పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. రాత్రి పూట భోజనం చేసిన తరువాత ఉదయం మళ్లీ బ్రేక్ ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది. ఆ సమయంలో లివర్‌లో నిల్వ ఉండే గ్లూకోజ్ స్థాయిలు ఖర్చయిపోతాయి. ఈ క్రమంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే శరీరానికి గ్లూకోజ్ లభించదు. దీని కారణంగా శరీరం కొవ్వులపై ఆధార పడుతుంది. ఈ క్రమంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పడిపోతాయి. కనుక ఈ సమస్య ఉత్పన్నం అవకుండా ఉండాలంటే ఉదయం కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్‌ను చేయాల్సి ఉంటుంది.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది. దీని కారణంగా ఒత్తిడి హార్మోన్లయిన కార్టిసాల్ వంటివి ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆకలిని పెంచే హార్మోన్ల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో విపరీతంగా ఆకలి అవుతుంది. దీని వల్ల రోజులో ఇతర సమయాల్లో కావల్సిన దాని కన్నా అధికంగా ఆహారం తింటారు. దీని వల్ల శరీరంలో క్యాలరీలు చేరి కొవ్వు పెరుగుతుంది. అధిక బరువు పెరుగుతారు. ఇలా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం అనే చర్య పరోక్షంగా అధిక బరువుకు కారణం అవుతుంది. కనుక ఉదయం కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే తలెత్తే మరో సమస్య మెటబాలిజం తగ్గిపోవడం. దీని కారణంగా శరీరం క్యాలరీలను సరిగ్గా ఖర్చు చేయదు. దీంతో కొవ్వు నిల్వలు పేరుకుపోయి అధికంగా బరువు పెరుగుతారు. ఈ విధంగా రెండు రకాలుగా బరువు పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి.
చాలా మంది ఉదయం సమయం లేదని, లేదా ఆఫీస్‌కు ఆలస్యం అవుతుందని బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. కచ్చితంగా ఏదో ఒక ఆహారం తినాలి. ఇతర అల్పాహారాలను తయారు చేసేందుకు సమయం లేకపోతే కనీసం పండ్లు, ఉడకబెట్టిన గుడ్లు, విత్తనాలు, నట్స్ వంటి వాటిని తినాలి. ఇవి పోషకాలను అందించడమే కాదు, ఆకలి ఎక్కవగా అవకుండా చేస్తాయి. బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ప్రోటీన్లు ఉండే ఆహారాలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. కోడిగుడ్లు, గింజలు, విత్తనాలను తింటే ఉపయోగం ఉంటుంది. వీటిని వండాల్సిన పనిలేదు. కేవలం గుడ్లను మాత్రం ఉడకబెడితే సరిపోతుంది. ఇతర పదార్థాలను రాత్రి పూట నీటిలో నానబెడితే చాలు, ఉదయం తినవచ్చు. ఇలా చాలా సులభంగా అల్పాహారం రెడీ అయిపోతుంది. దీన్ని తింటే అనేక లాభాలు కలుగుతాయి. కానీ ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయకూడదు.